





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
సులైమాన్ ఇబ్న్ సురద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉన్నాను. అప్పుడు ఇద్దరు వ్యక్తులు తగవులాడుకుంటున్నారు, ఒకరినొకరు అవమానకరంగా దూషించుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ముఖం కోపంతో ఎర్రబారింది, అతని మెడనరాలు ఉబ్బిపోయాయి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నాకు ఒక మాట తెలుసు, ఒకవేళ అతడు దానిని పలికినట్లయితే, అది అతణ్ణి ప్రశాంతపరుస్తుంది, అతడు “అఊదుబిల్లాహి మినష్’షైతాన్” (నేను షైతాను నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను) అని పలికినట్లయితే అతడు ఉన్న స్థితి (కోప స్థితి) తొలిగి పోతుంది”. అక్కడ ఉన్నవారు అతనితో (కోపంతో ముఖము ఎర్రబారిన వ్యక్తితో) “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షైతాను నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరుకోమన్నారు” అని తెలియజేసారు. దానికి అతడు “నేనేమైనా పిచ్చివాడినా?” అన్నాడు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఇద్దరు వ్యక్తులు తగవులాడుకుంటున్నారు, వారిలో ఒకతని ముఖం కోపంతో ఎర్రబారి, అతడి మెడనరాలు ఉబ్బిపోయాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నాకు ఒక మాట తెలుసు. ఒకవేళ అతడు ఆ మాట పలికినట్లయితే అతడి కోపం దూరమై పోతుంది. అతడు ఇలా పలకాలి “అఊదు బిల్లాహి మినష్’షైతానిర్రజీం” (నేను శపించబడిన షైతాను బారి నుండి అల్లాహ్ రక్షణ కోరుతున్నాను)” అన్నారు. అక్కడ ఉన్న వారు అతనితో “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అఊదు బిల్లాహి మినష్’షైతానిర్రజీం” అని పలుకమని చెప్పినారు” అని తెలియజేసారు. దానికి అతడు “నేనేమైనా పిచ్చివాడినా?” అన్నాడు. మతిస్థిమితం కోల్పోయిన వాడు తప్ప షైతాను నుండి ఎవరూ రక్షణ కోరుకోరు అని అతడు భావించినాడు.
అబూ ఖతాదహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిద్రలో మంచి దృశ్యాన్ని చూడడం అల్లాహ్ వైపు నుండి అయి ఉంటుంది; కనుక నిద్రలో మీరు భయపడే, లేదా భయం కలిగించే కల ఏదైనా చూసినట్లయితే అతడు తన ఎడమ వైపునకు ఉమ్మివేయాలి మరియు దాని కీడు నుండి అల్లాహ్ యొక్క శరణు, రక్షణ కోరుకోవాలి; అపుడు అది అతనికి ఎలాంటి నష్టాన్నీ కలుగజేయదు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: కలలో మనసును ఆహ్లాదపరిచే దృశ్యం చూడడం అనేది అల్లాహ్ వైపునుండి అయి ఉంటుంది. అలాగే ఏ మాత్రమూ ఇష్టపడని, కలవరపరిచే, విచారానికి గురిచేసే దృశ్యాలు కలలో కనపడడం అది షైతాను వైపు నుంచి అయి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కలలో తనకు అసహ్యంగా అనిపించే, తాను ఇష్టపడని దృశ్యాన్ని చూసినట్లయితే అతడు తన ఎడమ వైపునకు ఉమ్మివేయాలి. దాని కీడునుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరుకోవాలి. అపుడు అది అతనికి ఎలాంటి హానీ కలిగించదు. ఎందుకంటే అల్లాహ్ ఇందులో పేర్కొనబడిన విషయాన్ని, అటువంటి చెడు కలలో చూసిన తాను ఇష్టపడని విషయము యొక్క కీడు నుండి అల్లాహ్ యొక్క రక్షణ మరియు ఆయన శరణు వేడుకోవడానికి దానిని ఒక కారణంగా చేసినాడు.
ఉఖబహ్ ఇబ్నె ఆమిర్ అల్ జుహనీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్! “అల్-నజాహ్” (విముక్తి, మోక్షము, విమోచనము మొ.) అంటే ఏమిటి?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నీ నాలుకను అదుపులో ఉంచుకో; ఇంటి పట్టునే ఉండు; మరియు నీ పాపముల పట్ల దుఃఖించు” అన్నారు.
అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఉఖబహ్ బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు), ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఈ లోకము నందు మరియు పరలోకము నందును ఒక విశ్వాసి మోక్షము పొందే మార్గములు ఏమిటి అని ప్రశ్నించినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “దానికి నీవు మూడు విషయాలు ఆచరించాలి” “మొదటిది: చెడు విషయాలు మాట్లాడుట నుండి, కీడు కలిగించే విషయాలు పలుకుట నుండి నీ నాలుకను అదుపులో ఉంచుకో, (నీ నాలుకతో) మంచి తప్ప మరేమీ మాట్లాడకు.” “రెండవది: నీ ఏకాంతములో అల్లాహ్’ను ఆరాధించుట కొరకు (ఎక్కువగా) ఇంటి పట్టునే ఉండు; సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు విధేయత చూపే కార్యాలలో నిన్ను నీవు నిమగ్నం చేసుకో; (ప్రాపంచిక) ప్రలోభాలనుండి, ఆకర్షణల నుండి నిన్ను నీవు వేరు చేసుకో”; “మూడవది: నీవు చేసిన పాపాల పట్ల దుఃఖపడు, విచారపడు మరియు పశ్చాత్తాపపడు.”
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక ఎడారి వాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేసే ఏదైనా ఒక మంచి ఆచరణను నాకు సూచించండి”. దానికి ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ ను ఆరాధించు; (అందులో) ఆయనకు ఎవరినీ సాటి కల్పించకు; నిర్దేశించబడిన ఐదు నమాజులను ఆచరించు; విధి చేయబడిన జకాతును చెల్లించు; మరియు రమదాన్ మాసము ఉపవాసాలు పాటించు”. అది విని ఆ ఎడారి వాసి ఇలా అన్నాడు: “నా ప్రాణాలు ఎవరి చేతిలోనైతే ఉన్నాయో, ఆయన సాక్షిగా; మీరు చెప్పిన విషయాలకు ఒక్కటి కూడా అధికం చేయను (కలుపను)”. అలా అని అతడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఎవరైతే స్వర్గవాసులలో ఒక వ్యక్తిని చూడటానికి ఇష్టపడతారో, వారు అతడి వైపు చూడండి.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఎడారి వాసులలో నుండి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – తనను స్వర్గములోనికి ప్రవేశింపజేసే ఏదైనా ఆచరణను సూచించమని అడగడానికి వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి – స్వర్గములోనికి ప్రవేశించుట మరియు నరకాగ్ని నుండి విముక్తి పొందుట అనేది ఇస్లాం యొక్క మూలస్థంభములను ఆచరించుటపై ఆధారపడి ఉంటుంది; వాటిలో ఒకటి అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట, మరియు ఆయనకు ఎవరినీ సాటి కల్పించకుండా ఉండుట; రాత్రీ మరియు పగటి పూటలలో అల్లాహ్ తన దాసులపై విధిగావించిన ఐదు నమాజులను నెలకోల్పటం; అల్లాహ్ నీపై విధిగావించిన జకాతును అర్హులైన వారికి తప్పనిసరిగా చెల్లించుట; రమజాన్ మాసపు ఉపవాసాల ఆచరణను వాటి కొరకు విధిగావించబడిన సమయములోనే ఆచరించుట. అది విని ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉన్నదో ఆయన సాక్షిగా, మీ నుంచి నేను విన్నటువంటి విధిగావించబడిన ఆరాధనలకు ఒక్కటి కూడా ఎక్కువ కలుపను, అలాగే వాటి నుండి ఒక్కటి కూడా తక్కువ చేయను.” అతడు అక్కడి నుండి బయలుదేరిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే స్వర్గవాసులలో ఒక వ్యక్తిని చూడటానికి ఇష్టపడతారో, వారు ఈ ఎడారి నివాసిని చూడండి.”
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పలవు గాక!”; అక్కడ ఉన్నవారు “ఎవరు, ఓ రసూలల్లాహ్?” అని అడిగారు. దానికి ఆయన “ఎవరి జీవిత కాలములోనైతే అతని తల్లిదండ్రులలో, ఒకరు గానీ లేక ఇద్దరు గానీ, వృద్ధాప్యానికి చేరుకున్నారో, మరియు (వారికి సేవ చేయని కారణంగా) అతడు స్వర్గములోనికి ప్రవేశించలేదో అతడు.” అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శాపనార్థాలు పెట్టినట్లుగా అతడికి తలవంపులు కలగాలని, అతడు అవమానం పాలు కావాలని, ఎంతగా దుఆ చేసినారు అంటే, చివరికి వారి ముక్కు మట్టిలో పెట్టినంతగా. అక్కడ ఉన్న వారు “ఎవరు అతడు ఓ రసూలల్లాహ్, మీరు అంతగా అతనికి వ్యతిరేకంగా దుఆ చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘ఎవరైతే తన తల్లిదండ్రులలో – ఒకరిని గానీ లేక ఇద్దరిని గానీ - తన జీవితములోనే వృద్ధాప్యానికి చేరుకోవడం చూస్తాడో, వారి పట్ల దయ, కరుణ కలిగి ఉండక, వారి పట్ల అవిధేయుడై ఉండి ఆ కారణంగా అతడు స్వర్గములోనికి ప్రవేశించలేడో – అతడు’ అన్నారు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒకసారి, రసూలుల్లాల్ సల్లల్లాహు అలైహి వసల్లం తో మక్కా నగరానికి వెళ్ళే దారిపై ప్రయాణిస్తుండగా, ‘జుమ్’దాన్’ అని పిలవబడే ఒక పర్వతం ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. అపుడు ఆయన ఇలా అన్నారు: “కదలండి ముందుకు, ఇది ‘జుమ్’దాన్’ (పర్వతం); ‘ముఫర్రిదూన్’లు దీనిని అధిగమించినారు”. ఆయన వెంట ఉన్న వారు “ముఫర్రిదూన్ అంటే ఎవరు ఓ రసూలల్లాహ్?” అని ప్రశ్నించారు. దానికి ఆయన: “అల్లాహ్’ను అధికంగా స్మరించే పురుషులు, మరియు అల్లాహ్’ను అధికంగా స్మరించే స్త్రీలు” అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్’ను అధికంగా స్మరించే వారి స్థాయిని గురించి వివరించారు. వారు స్వర్గవనాలలో అత్యున్నత స్థానాలను పొందుటలో ఇతరుల కంటే ప్రత్యేకులు, మరియు ఇతరుల కంటే ముందుంటారు. ఆయన వారిని ‘జుమ్’దాన్’ పర్వతంతో పోల్చినారు, జుమ్’దాన్ పర్వతం మిగతా పర్వతాల కంటే ప్రత్యేకంగా, ఒంటరిగా, నిలబడి ఉంటుంది.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “నా ఉమ్మత్ మొత్తం (అల్లాహ్ చేత) క్షమించబడుతుంది; ఎవరైతే బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడతారో వారు తప్ప. బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడుటలో ఇది కూడా ఒక రకం – అందులో ఒకడు రాత్రివేళ పాపకార్యానికి ఒడిగడతాడు; ఉదయానికి అల్లాహ్ అతని పాపకార్యాన్ని (లోకులనుండి) కప్పివేస్తాడు; కానీ అతడు: “ఓ ఫలానా! ఓ ఫలానా! (నీకు తెలుసా) నేను రాత్రి ఇలా ఇలా చేసాను” అంటాడు (అలా అని దానిని బహిరంగ పరుస్తాడు). రాత్రి అతడు అల్లాహ్ యొక్క పరదా మాటున గడిపినప్పటికీ, ఉదయం అతడు తనంతట తానే ఆ పరదాను తొలగిస్తాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా విశదపరుస్తున్నారు: పాప కార్యాలకు పాల్బడిన ఒక ముస్లిం కొరకు అల్లాహ్ చేత అతని పాపములు క్షమించబడుటకు, అతనికి అల్లాహ్ చేత క్షమాభిక్ష ప్రసాదించబడుటకు అవకాశం ఉన్నది; కేవలం చేసిన పాపాన్ని గర్వంగా, డంబాలు పలుకుతూ, మూఢంగా జనుల ముందు బయల్పరిచే వాడు తప్ప. అటువంటి వాడు క్షమాభిక్షకు పాత్రుడు కాడు; ఎందుకంటే రాత్రివేళ అతడు పాపకార్యానికి ఒడిగడతాడు, అపుడు అల్లాహ్ అతడి పాపాన్ని (లోకుల నుండి) కప్పివేసి ఉంచినప్పటికీ; ఉదయం అతడు తాను క్రితం రాత్రి ఇలా ఇలా చేసాను అని చెబుతాడు. రాత్రి అతడు తన ప్రభువు పరదా మాటున గడుపుతాడు, కానీ ఉదయం అతడు స్వయంగా ఆ పరదాను తొలగించి తనను తాను బహిరంగ పరుచుకుంటాడు.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “మరణానికి మూడు దినముల ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “మీలో ఎవ్వెరూ అల్లాహ్ పట్ల ఉత్తమమైన అంచనాలు కలిగి ఉన్న స్థితిలో తప్ప చనిపోకండి.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ముస్లిములకు అల్లాహ్ పట్ల ఉత్తమమైన అంచనాలను కలిగి ఉన్న స్థితిలో తప్ప చనిపోకండి అని హితబోధ చేస్తున్నారు. ముఖ్యంగా మరణ శయ్యపై ఉన్న స్థితిలో (భయం కాక) అల్లాహ్ యొక్క కరుణ, క్షమాపణ పట్ల ఆశ, విశ్వాసము అత్యున్నత స్థితిలో ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ పట్ల భయం అనేది మంచి పనులు చేయుటను వృద్ధి చేస్తుంది. కానీ మరణ శయ్యపై ఉన్న స్థితి ఆచరణలను వృద్ధి చేసుకుని సమర్పించుకునే స్థితి కాదు. కనుక ఆ స్థితిలో కావలసినది అల్లాహ్ యొక్క కరుణ మరియు క్షమాపణ పట్ల అచంచలమైన విశ్వాసము మరియు ఆశ.
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “ఇస్రా (మేరాజ్) యాత్ర జరిగిన రాత్రి నేనుఇబ్రాహీం (అలైహిస్సలాం) ను కలిసాను. ఆయన ఇలా అన్నారు “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! నీ ఉమ్మత్’కు నా సలాం తెలియజేయి, వారికి తెలియజేయి స్వర్గములో స్వచ్ఛమైన నేల మరియు మధురమైన నీరు ఉన్నాయి. అది ఒక విశాలమైన మైదానం, మరియు దాని మొలకలు “సుబ్’హానల్లాహి” (అల్లాహ్ పరమ పవిత్రుడు); మరియు “వల్’హందులిల్లాహి” (సర్వస్తోత్రములు, ప్రశంసలు, పొగడ్తలు, కృతజ్ఞతలు అన్నీ అల్లాహ్’కే చెందుతాయి); మరియు “వ లా ఇలాహ ఇల్లల్లాహు” (అల్లాహ్ తప్ప వేరే ఇతర నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు “వల్లాహు అక్బర్” (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు)”.
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రా మరియు మే’రాజ్ యాత్ర జరిగిన రాత్రి అల్లాహ్ మిత్రుడైన ఇబ్రాహీం (అలైహిస్సలాం) ను కలిశానని, మరియు ఆయన తనతో ఇలా అన్నారు అని తెలియజేస్తున్నారు: “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ సమాజానికి నా శుభాకాంక్షలు తెలియజేయండి, మరియు స్వర్గములో మనోహరమైన నేల, అసలే మాత్రమూ ఉప్పదనం లేని మధురమైన నీరు ఉన్నాయని, స్వర్గం సువిశాలమైనదని, చదునైనదని, మరియు వృక్షాలు లేనిదని వారికి చెప్పండి. దాని మొలకలు మంచి మాటలు, అవి శాశ్వతమైన ధర్మకార్యాలు: అవి ““సుబ్’హానల్లాహి” (అల్లాహ్ పరమ పవిత్రుడు); మరియు “వల్’హందులిల్లాహి” (సర్వస్తోత్రములు, ప్రశంసలు, పొగడ్తలు, కృతజ్ఞతలు అన్నీ అల్లాహ్’కే చెందుతాయి); మరియు “వ లా ఇలాహ ఇల్లల్లాహు” (అల్లాహ్ తప్ప వేరే ఇతర నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు “వల్లాహు అక్బర్” (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు)” అని తెలియజేయండి. మరియు ఒక ముస్లిం ఆ పదాలను పలికి, పునరావృతం చేసినప్పుడల్లా, అతని కోసం స్వర్గంలో ఒక మొక్క నాటబడుతుంది.”