





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “(ఒకసారి) ము’ఆవియహ్ రజియల్లాహు అన్హు మస్జిదులో వృత్తాకారంలో కూర్చుని ఉన్న కొంతమంది యువకుల వద్దకు వెళ్ళి “ఏ విషయం మిమ్మల్ని ఇక్కడ ఇలా కూర్చునేలా చేసింది?” అని ప్రశ్నించారు. దానికి వారు “అల్లాహ్’ను స్మరించడానికి (జిక్ర్ చేయడానికి) కూర్చున్నాము” అన్నారు. దానికి ఆయన “అల్లాహ్ సాక్షిగా చెప్పండి దాని కొరకు తప్ప (మరింక దేని కొరకూ) కూర్చోలేదా మీరు?” అన్నారు. అందుకు వారు “అల్లాహ్ సాక్షిగా దాని కొరకు తప్ప (మరింక దేని కొరకూ) కూర్చో లేదు మేము” అన్నారు. అపుడు ఆయన వారితో “మిమ్మల్ని నిందించడానికి ప్రమాణం చేయమని అనలేదు; దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం కు సంబంధించి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు నా అంత సన్నిహితంగా ఉన్న ఏ ఒక్కరూ కూడా నా కంటే తక్కువ హదీథులు చెప్పలేదు.” “వాస్తవానికి (ఒకసారి) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో కొంతమంది, వృత్తాకారంలో కూర్చుని ఉండగా వారి వద్దకు వెళ్ళి “ఏ విషయం మిమ్మల్ని ఇక్కడ ఇలా కూర్చునేలా చేసింది?” అని ప్రశ్నించారు. దానికి వారు ఇలా అన్నారు “మమ్మల్ని ఇస్లాం వైపు నడిపించినందుకు, మాపై తన అనుగ్రహాలను కురిపించినందుకు అల్లాహ్ ను స్మరించడానికి, ఆయనను స్తుతించడానికి మేము ఇక్కడ కూర్చున్నాం”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా చెప్పండి దాని కొరకు తప్ప (మరింక దేనికొరకూ) కూర్చోలేదా మీరు?” అన్నారు. అందుకు వారు “అల్లాహ్ సాక్షిగా దానికొరకు తప్ప (మరింక దేనికొరకూ) కూర్చో లేదు మేము” అన్నారు. అపుడు ఆయన వారితో “వాస్తవానికి మిమ్ములను నిందించడానికి ప్రమాణం చేయమని అనలేదు; కానీ జీబ్రయీల్ అలైహిస్సలాం నా వద్దకు వచ్చారు, దైవదూతల ముందు అల్లాహ్ మిమ్మల్ని గురించి గర్విస్తున్నాడు” అని తెలియజేశారు.”
ముస్లిం నమోదు చేసినారు:ముఆవియా ఇబ్న్ అబీ సుఫ్యాన్ రజియల్లాహు అన్హుమా ఒకసారి, కొద్దిమంది సహాబాలు వృత్తాకారంలో కూర్చుని ఉండగా వారి వద్దకు వెళ్ళి దేని కొరకు అలా సమావేశమయ్యారని ప్రశ్నించారు. వారు “అల్లాహ్ యొక్క స్మరణ కొరకు కూర్చున్నాము” అని బదులిచ్చారు. అపుడు ఆయన రజియల్లాహు అన్హు అక్కడ అలా గుమిగూడి కూర్చోవడం కేవలం అల్లాహ్ యొక్క స్మరణ కొరకు మాత్రమే తప్ప మరింకేమీ కాదు అని వారితో ప్రమాణం చేయించినారు. వారు ఆ విధంగా ప్రమాణం చేసినారు. అప్పుడు ఆయన వారితో : “నేను మీతో ప్రమాణం చేయించింది మిమ్ములను అనుమనించో, లేక మీ సత్యసంధతను శంకించో కాదు” అని పలికి, వారికి ఇలా తెలియజేసినారు – సహాబాలలో తనంత సన్నిహితంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు ఇంకెవ్వరూ లేరనీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య ఉమ్మె హబీబహ్ రజియల్లాహు అన్హా తన సహోదరి అనీ, అంతేగాక ‘కాతిబ్ అల్ వహీ’ లలో (ఖుర్’ఆన్ అవరణ జరుగుతుండగా గ్రంథస్థం చేసిన వ్రాయసకారులలో) తాను ఒకడినని – అయినప్పటికీ తాను చాలా కొద్ది హదీథులను మాత్రమే ఉల్లేఖించినానని తెలియజేసినారు. తరువాత ఆయన వారితో “ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటినుండి బయటకు వచ్చినారు. వారి చూపు అక్కడ మస్జిదులో వృత్తాకారములో కూర్చుని ఉన్న కొంతమంది సహాబాలపై పడింది. వారు, తమను ఇస్లాం వైపు నడిపించినందుకు, తమపై తన అనుగ్రహాలను కురిపించినందుకు అల్లాహ్ ను స్మరిస్తున్నారు, ఆయనను కొనియాడుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సహాబాలను, ముఆవియహ్ రజియల్లాహు అన్హు తన అనుచరులను ప్రశ్నించిన మాదిరిగా ప్రశ్నించినారు, ఆయన వారితో ప్రమాణం చేయించిన మాదిరిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రమాణం చేయించినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సహాబాలకు తాను ఆ విధంగా వారిని ప్రశ్నించడం మరియు వారితో ప్రమాణం చేయించడం వెనుక ఉన్న కారణాన్ని తెలియజేసినారు – దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం తన వద్దకు వచ్చినారని, సర్వోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అలాహ్ మిమ్ములను గురించి తన దైవదూతల ముందు గర్వపడుతున్నడని, మీ ఘనతలను, మీ సత్కార్యాలను వారికి చూపుతున్నాడని, వారి ఎదుట మిమ్ములను పొగుడుతున్నాడని జిబ్రయీల్ అలైహిస్సలాం తనకు సమాచారమిచ్చినారని వారికి తెలియజేసినారు.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను. “ఒక వ్యక్తి తన ఇంటి లోనికి ప్రవేశిస్తే, ప్రవేశించే ముందు మరియు భోజనం చేయడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించినట్లయితే – షైతాను ఇలా అంటాడు “ఈ రాత్రి గడపడానికి మీకు స్థలమూ లేదు మరియు తినడానికి భోజనమూ లేదు”. మరియు (ఆ వ్యక్తి) ఇంటిలోనికి ప్రవేశిస్తే, ప్రవేశించడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించనట్లయితే షైతాను ఇలా అంటాడు “రాత్రి గడపాడానికి స్థలం దొరికింది”; మరియు (ఆ వ్యక్తి) భోజనం తినడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించనట్లయితే, (షైతాను) ఇలా అంటాడు “రాత్రి గడపడానికి స్థలమూ మరియు భోజనమూ రెండూ దొరికాయి.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఇంటిలో ప్రవేశించడానికి ముందు మరియు భోజనం తినుట ప్రారంభించడానికి ముందు అల్లాహ్ పేరును స్మరించమని ఆదేశిస్తున్నారు. అల్లాహ్ పేరును స్మరించుట అంటే ఇంటిలో ప్రవేశించుటకు ముందు, మరియు భోజనం తినుట ప్రారంభించుటకు ముందు “బిస్మిల్లాహ్” అని పలుకుట. అపుడు షైతాను తన అనుచరులతో ఇలా అంటాడు: “మీకు ఈ ఇంటిలో రాత్రి గడిపే అవకాశం గానీ భోజనం చేసే అవకాశం గానీ లేవు; ఈ ఇంటి యజమాని అల్లాహ్ పేరును స్మరించుట ద్వారా మీనుండి తనను తాను రక్షించుకున్నాడు.” మరియు ఒకవేళ ఆ వ్యక్తి ఇంటిలోనికి ప్రవేశించినపుడు, ప్రవేశించడానికి ముందు అల్లాహ్ పేరును స్మరించకపోయినా, భోజనం తినుట ప్రారంభించడానికి ముందు అల్లహ్ పేరును స్మరించకపోయినా, షైతాను తన అనుచరులతో ఇలా అంటాడు: “ఈ ఇంటిలో రాత్రి గడపడానికి, భోజనం చేయడానికి అవకాశం దొరికింది.”
అబూ మూసా అల్ అషఅరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక మంచి సహచరుని సాంగత్యము, మరియు ఒక చెడు సహచరుని సాంగత్యముల యొక్క ఉపమానం కస్తూరి సుగంధాన్ని అమ్మువానికి, మరియు లోహకారుని (కమ్మరివాని) కొలిమి తిత్తులను ఊదు వానిని పోలి ఉన్నది. కస్తూరి సుగంధాన్ని అమ్మువాడు: అతడు నీకు కొద్ది సుగంధాన్ని ఉచితంగా ఇస్తాడు, లేదా నీవు అతడి నుండి కొద్ది సుగంధాన్ని కొనుక్కుంటావు, లేదా (అతని సాంగత్యములో గడిపిన కారణంగా) నీవు సుగంధాన్ని ఆస్వాదిస్తావు. లోహకారుని కొలిమి తిత్తులను ఊదువాడు: (కొలిమి నుండి నిప్పు రవ్వలు ఎగరడం వల్ల) అతడు నీ వస్త్రాలను కాలుస్తాడు, లేదా నీవు అతడి నుండి అప్రియమైన వాసన చూస్తావు”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు రకాల ప్రజలను గురించి ఉపమానము ఇస్తున్నారు. మొదటి రకం: మంచి సహచరుడు లేక ఒక మంచి మిత్రుడు. అతడు అల్లాహ్ వైపునకు మరియు అల్లాహ్ ఇష్టపడే వాటి వైపునకు మార్గదర్శకం చేస్తాడు మరియు అల్లాహ్’కు విధేయుడై ఉండుటలో సహాయపడతాడు. అతని ఉపమానము కస్తూరి సుగంధాన్ని అమ్మువానిని పోలినది. అతడు నీకు కొద్ది సుగంధాన్ని ఉచితంగా ఇస్తాడు; లేదా వీలైతే అతని వద్దనుండి నీవు కొంత సుగంధ ద్రవ్యాన్ని కొనుక్కుంటావు; లేదా నీవు ఆ సుగంధాన్ని ఆస్వాదిస్తావు. రెండవ రకం: చెడు సహచరుడు మరియు చెడు మిత్రుడు: ఇతడు అల్లాహ్ యొక్క మార్గమునుండి మళ్ళిస్తాడు; పాపకార్యములు చేయుటలో సహాయపడతాడు, నీవు అతని నుండి అసహ్యకరమైన ఆచరణలు చూస్తావు, అటువంటి వాడు నీ మిత్రుడు అయినందుకు మరియు నీ సహచరుడు అయినందుకు ప్రజలు నిన్ను నిందిస్తారు. అతడి ఉపమానము కొలిమిలో గాలితిత్తులు ఊదుతూ ఉండే కమ్మరివాని వంటిది. పైకి ఎగిరే నిప్పు రవ్వల కారణంగా అతడు నీ వస్త్రాలను కాలుస్తాడు, లేదా అతని సమీపములో (అతని సాంగత్యములో) ఉన్న కారణంగా అతడి నుండి అప్రియమైన వాసనను చూస్తావు.
అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరుచుగా ఇలా దుఆ చేస్తూ ఉండేవారు “యా ముఖల్లిబల్ ఖులూబ్, సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్” (ఓ హృదయాలను త్రిప్పివేసేవాడా! నా హృదయాన్ని నీ ధర్మంపై దృఢంగా ఉండేలా చేయి). నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్! మేము మిమ్మల్ని విశ్వసించినాము, మరియు మీరు ఏ సందేశమునైతే తెచ్చినారో దానిని విశ్వసించినాము. మీరు మా గురించి భయపడుతున్నారా?” దానికి ఆయన “అవును, (ఎందుకంటే) హృదయాలు అల్లాహ్ చేతి రెండు వేళ్ళమధ్య ఉంటాయి. ఆయన వాటిని తన చిత్తము వచ్చిన వైపునకు మరల్చుతాడు” అన్నారు.”
అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సాధారణంగా అల్లాహ్’తో తరుచూ చేసే దుఆ (విన్నపం) - ధర్మంలో, మరియు ఆయనకు విధేయునిగా ఉండుటలో స్థిరత్వం ప్రసాదించమని అల్లాహ్’ను కోరడం, మరియు వాటి నుండి (ధర్మము నుండి, ఆయన విధేయత నుండి) మరలిపోకుండా, మరియు మార్గభ్రష్టత్వం నుండి, తప్పుదోవల నుండి దూరంగా ఉండేలా చేయమని అల్లాహ్ ను వేడుకోవడం. అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆను తరుచూ పునరావృతం చేస్తూ ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "హృదయాలు అల్లాహ్ యొక్క రెండు వేళ్ల మధ్య ఉన్నాయి. ఆయన తాను కోరిన విధంగా వాటిని తిప్పుతాడు.” అని పలికినారు. విశ్వాసమైనా, అవిశ్వాసమైనా అవి ఉండే స్థానము ‘హృదయం’. అరబీ భాషలో హృదయాన్ని ‘అల్ ఖల్బ్’ అంటారు. ‘ఖల్బ్’ అనే పదానికి అరబీ భాషలో ‘దొర్లుట’; ‘నిలకడలేని’; ‘త్రిప్పివేయు’; ‘స్థిరత్వములేని’ అనే అర్థాలున్నాయి. ఒక కుండలో దేనినైనా ఉడకబెడుతూ ఉంటే, అది ఏవిధంగా తొందరలోనే మార్పునకు లోనవుతుందో, హృదయం కూడా అదే విధంగా స్థిరత్వం లేకుండా మారిపోతూ, తిరిగిపోతూ ఉంటుంది. అందుకనే అరబీ భాషలో హృదయాన్ని “అల్’ఖల్బ్” అన్నారు. కనుక అల్లాహ్ తాను కోరిన వాని హృదయాన్ని మార్గదర్శకంపై స్థిరంగా ఉంచుతాడు; దానిని ధర్మములో స్థిరపరుస్తాడు; మరియు తాను కోరిన వాని హృదయాన్ని సన్మార్గమునుండి తప్పిస్తాడు, మార్గభ్రష్టత్వంలో విడిచి పెడతాడు.
అబూ ఉమామహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నాకు ఈ విషయాన్ని అమ్ర్ ఇబ్న్ అబసహ్ రదియల్లాహు అన్హు తెలియజేసారు; ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నారు: “ప్రభువు (అల్లాహ్) తన దాసునికి అతి చేరువలో ఉండే సమయం ఏది అంటే అది రాత్రిలోని చివరి భాగము. ఆ ఘడియలో (రాత్రి చివరి భాగములో) అల్లాహ్ ను స్మరించే వారిలో ఒకరు కాగలిగే సామర్థ్యము మీలో ఉంటే అలా చేయండి.”
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: " సర్వశక్తిమంతుడు అయిన అల్లాహ్ రాత్రి చివరి మూడవ భాగంలో, తన దాసునికి అత్యంత చేరువగా ఉంటాడు; కనుక ఓ విశ్వాసి! మీరు నిద్ర నుండి లేవడంలో విజయం సాధిస్తే, ఈ సమయంలో అల్లాహ్ను ఆరాధించే, ప్రార్థించే, ధ్యానించే మరియు అల్లాహ్ ఎదుట పశ్చాత్తాపపడే వారిలో మీరు కూడా చేరగలిగితే, అలా తప్పక చేయండి, ఎందుకంటే ఇది శ్రద్ధతో ఒడిసి పట్టుకోవలసిన అద్భుత అవకాశం.
సౌబాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మనిషి ఖర్చు చేసే దీనార్లలో ఉత్తమమైన దీనార్ ఏది అంటే అతడు తన కుటుంబము పై ఖర్చు చేసినది; తరువాత అల్లాహ్ మార్గములో తన పశువులపై ఖర్చు చేసే దీనార్; తరువాత అల్లాహ్ మార్గములో తన సహచరులపై ఖర్చు చేసే దీనార్. అబూ ఖిలాబహ్ (హదీసు ఉల్లేఖకులలో ఒకరు) ఇలా అన్నారు: “ఆయన కుటుంబము (పై ఖర్చు చేయుట) తో మొదలు పెట్టినారు”, తరువాత అబూ ఖిలాబహ్ ఇంకా ఇలా అన్నారు: “తన కుటుంబములోని చిన్న పిల్లల కోసం ఖర్చు చేసే వ్యక్తి కంటే గొప్ప ప్రతిఫలం ఎవరికి ఉంటుంది? తద్వారా అతడు వారిని కాపాడుతాడు (కోరికల నుండి కాపాడతాడు) మరియు దాని వల్ల అల్లాహ్ వారికి లాభం చేకూరుస్తాడు మరియు వారిని సంపన్నులుగా చేస్తాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖర్చు చేయడం యొక్క వివిధ రూపాలను గురించి వివరిస్తున్నారు. మనం ఖర్చు చేసేటపుడు, ఖర్చు చేసే అంశాల ప్రాధాన్యతలో విభేదిస్తే, అన్నింటి కంటే ముందు విధిగా ఖర్చు చేయవలసిన అంశాల ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే విధంగా అంశాల ప్రాధాన్యతా క్రమంలో వాటిని అమర్చినారు. ఎవరిపై ఖర్చు చేయుట తనపై విధిగా ఉన్నదో, వారి కొరకు ఖర్చు చేయబడిన ధనం, సంపద ఒక ముస్లింకు అత్యంత ప్రతిఫలదాయకమైనది. ఉదాహరణకు : భార్య, పిల్లలు మొదలైనవారు. తరువాత, అల్లాహ్ మార్గములో ధర్మయుద్ధము కొరకు తయారు చేయబడిన వాహనము (జంతువు, ఒంటే, గుర్రము మొ.) పై ఖర్చు చేయుట. తరువాత అల్లాహ్ మార్గములో జిహాద్ (ధర్మయుద్ధము) చేయుచున్న స్నేహితులు మరియు సహచరులపై ఖర్చుచేయుట.
అబీ సయీద్ అల్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా విన్నారు: “మీలో ఎవరైనా (నిద్రలో) ఏదైనా కల చూసినట్లయితే, మరియు ఒకవేళ అది మీకు ఇష్టమైన కల అయినట్లయితే, అది అల్లాహ్ తరఫు నుంచి (అని భావించాలి); అందుకు మీరు అల్లాహ్’కు కృతఙ్ఞతలు తెలుపుకోవాలి, ఆయన ఘనతను కొనియాడాలి మరియు ఇతరులకు తెలియజేయాలి. మరి ఒకవేళ మీకు వచ్చిన కలను మీరు ఇష్టపడనట్లయితే, అది షైతాను తరఫు నుంచి (అని భావించాలి), అందుకు మీరు అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి, మరియు దానిని ఇతరులకు తెలియజేయకూడదు. ఎందుకంటే అది మీకు ఎలాంటి హానీ కలుగజేయదు.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: కలలో ఏదైనా మంచి విషయాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే విషయాన్ని చూసినట్లయితే అది అల్లాహ్ తరఫు నుండి అవుతుంది. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు – అందుకు బదులుగా మీరు అల్లాహ్ యొక్క ఘనతను కీర్తించండి, ఆయనకు కృతఙ్ఞతలు తెలియజేయండి, మరియు దానిని ఇతరులకు తెలియజేయండి. ఒకవేళ కలలో ఏదైనా చెడు విషయాన్ని అంటే బాధకు, విచారానికి గురిచేసే విషయాన్ని చూసినట్లయితే, అది షైతాను తరఫు నుండి అవుతుంది. అందుకు మనం అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి, మరియు దాని గురించి ఇతరులకు తెలియజేయరాదు, ఎందుకంటే అది మనకు ఎటువంటి హాని కలుగజేయదు; అల్లాహ్ ఇందులో పేర్కొనబడిన విషయాన్ని, అటువంటి చెడు కల నుండి అల్లాహ్ యొక్క రక్షణ మరియు ఆయన శరణు వేడుకోవడానికి ఒక కారణంగా చేసినాడు.
షుఐబ్ ఇబ్న్ సినాన్ అర్’రూమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక విశ్వాసి యొక్క వ్యవహారం ఎంత అద్భుతమైనది! నిశ్చయంగా అతని అన్ని వ్యవహారాలు అతని కొరకు శుభాల్నే కలిగి ఉంటాయి. ఇలా ఒక విశ్వాసికి తప్ప మరింకెవరికీ ఉండదు. ఒకవేళ అతనికి మంచి కలిగితే, అతడు (అల్లాహ్’కు కృతజ్ఞతలు తెలుపుకుని) కృతజ్ఞుడై ఉంటాడు, అది అతనికి శుభప్రదమైనది; ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే, అతడు దానిపై సహనం వహిస్తాడు, అది కూడా అతనికి శుభప్రదమైనదే.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసి యొక్క స్థితి మరియు అతని వ్యవహారాల పట్ల ప్రశంసా పూర్వకమైన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు; ఎందుకంటే అతడి అన్ని పరిస్థితులూ అతని కొరకు శుభాన్ని కలిగి ఉంటాయి. ఈ పరిస్థితి కేవలం ఒక విశ్వాసికి తప్ప మరింకెవ్వరికీ ఉండదు. ఒకవేళ అతనికి ఏదైనా శుభం కలిగితే అతడు దానిపై అల్లాహ్’కు కృతఙ్ఞతలు అర్పిస్తాడు, ఇంకా మరింతగా కృతజ్ఞుడై ఉంటాడు. దానికి గాను అతడు (తీర్పు దినాన) ప్రతిఫలం కూడా పొందుతాడు. అలాగే ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే అతడు దానిపై సహనం వహిస్తాడు. అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తాడు, అందుకు అతనికి ప్రతిఫలం లభిస్తుంది. కనుక ప్రతి స్థితిలోనూ అతనికి ప్రతిఫలం బహూకరించబడుతుంది.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడైనా తుమ్మినపుడు - తుమ్ము శబ్దాన్ని అణచివేయడానికి, లేదా తక్కువ చేయడానికి - తన చేతిని గానీ లేదా ఏదైనా వస్త్రాన్ని గానీ తన నోటికి అడ్డుగా పెట్టుకునేవారు.”
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడైనా తుమ్మినపుడు: మొదట: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నోటికి చేతిని లేదా ఏదైనా వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకునేవారు – తుమ్ము కారణంగా తన నోటి నుండి లేదా ముక్కు నుండి ఏమైనా బయటకు చింది అక్కడ కూర్చున్న వారికి ఇబ్బంది కలిగించకుండా. రెండు: ఆయన తన గొంతు నుండి ఎక్కువగా శబ్దం బయటకు రాకుండా (సాధ్యమైనంత) తక్కువ చేసేవారు.