





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “కొనుగోలు చేసేటపుడు, అమ్మేటపుడు మరియు అప్పు తిరిగి ఇచ్చివేయమని అడిగేటపుడు మృదువుగా వ్యవహరించే వానిని అల్లాహ్ కరుణించుగాక”.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీసులో ఎవరైతే, అమ్మకాలు మరియు కొనుగోళ్ళలో (కఠినంగా కాకుండా) మృదువుగా వ్యవహరిస్తారో అటువంటి వారందరిపై అల్లాహ్ యొక్క కరుణ కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థించినారు. అలాగే కొనుగోలు చేయు వానితో, మూల్యము పట్ల కఠినంగా ఉండరాదు, అతడితో మంచిగా ప్రవర్తించాలి. కొనుగోలు చేయునపుడు ఉదారంగా, విశాల దృక్పథంతో వ్యవహరించండి. కొనుగోలు చేయు వస్తువులను తక్కువ చేసి మాట్లాడకండి మరియు వాటి మూల్యమును (అకారణంగా) తక్కువ చేయకండి. (ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే) తన అప్పును తీర్చమని అతని వద్దకు వెళ్ళి అడిగేటప్పుడు, అతడు పేదరికంలో ఉంటే లేదా అతడే మరొకరిపై ఆధారపడి జీవిస్తున్న వాడైతే, అతడితో (కఠినంగా కాకుండా) మృదువుగా వ్యవహరించండి, అతడు అప్పు తీర్చగల స్థితిలో ఉన్నాడో లేదో గమనించండి.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఒక మనిషి ఉండేవాడు. అతడు ప్రజలకు అప్పులు ఇస్తూ ఉండేవాడు. అతడు తన సేవకునితో ఇలా అనేవాడు ‘నీవు (అప్పులు వసూలు చేసే టప్పుడు) పేదరికంలో ఉన్నవాని దగ్గరకు వెళితే, అతడి అప్పును ఉపేక్షించు. బహుశా అల్లాహ్ మన పాపాలను ఉపేక్షించవచ్చు (చూసీ చూడనట్లు వదిలివేయవచ్చు). (చనిపోయిన) తరువాత అతడు అల్లాహ్ ను కలిసినపుడు, అల్లాహ్ అతడి పాపాలను ఉపేక్షించి ఉంటాడు".
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో – తరుచూ ప్రజలకు అప్పులు ఇచ్చే వాని గురించి లేదా అరువు మీద ప్రజలకు సరుకులు అమ్మే వాని గురించి తెలియ జేస్తున్నారు. ఆ వ్యక్తి, అప్పులను వసూలు చేయుటకు వెళ్ళే తన సేవకునితో ఇలా అనేవాడు: ‘ఒకవేళ నీవు అప్పు తీసుకున్న వ్యక్తి వద్దకు వెళితే, తాను తీసుకున్న అప్పు తీర్చడానికి అతని వద్ద ఏమీ లేకపోయినట్లయితే, దాని గురించి కఠినంగా అడుగకు, అతడికి ఇంకా సమయం ఇవ్వడం ద్వారా, చూసీ చూడనట్లు వ్యవహరించు’. ‘లేదా (అతడు తీర్చవలసిన అప్పులో) అతడివద్ద ఇవ్వడానికి ఎంత ఉంటుందో అంతే తీసుకో, ఒకవేళ అందులో ఏదైనా లోపం ఉన్నా సరే’. అది అతని ఇచ్ఛ మరియు అల్లాహ్ తనను కూడా చూసీ చూడనట్లు వదిలివేస్తాడని మరియు తన పాపాలను క్షమిస్తాడని ఆశ. అతడు చనిపోయినపుడు అల్లాహ్ అతడిని క్షమించినాడు, అతడి పాపాలను చూసీచూడనట్లు వదిలి వేసినాడు.
అనస్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం: ఇస్లాంధర్మార్జన కొరకు ఇంటి నుండి బయల్దేరిన వ్యక్తి తిరిగి తన ఇంటికి చేరేవరకు అల్లాహ్ మార్గం లో ఉంటాడు.
దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారుహదీసు అర్ధం : తన ఇంటి నుండి లేదా నగరం నుండి ఇస్లాం ధర్మజ్ఞానాన్ని వెతుక్కుంటూ బయల్దేరిన వ్యక్తి ఆదేశం “దైవమార్గంలో జిహాద్ కొరకు బయల్దేరి తిరిగి తన ఇంటికి చెరుకునేవాడి ప్రకారంగా ఉంది అతను ఇస్లాంధర్మ సంస్థాపనకై షైతాను ను అపహాస్యపరచి,తనను అలసింపచేసిన ఒక ముజాహిద్ లాంటివాడు.
అబూ దర్, జున్దుబ్ బిన్ జునాదా, అబూ అబ్దిర్రహ్మాన్ మరియు ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు అన్హుమ్ ల ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికిననారు "మీరు ఎక్కడ ఉన్నా అల్లాహ్ పట్ల భయభీతి (తఖ్వా) కలిగి ఉండండి మరియు ఏదైనా చెడు పని చేస్తే, వెంటనే ఒక మంచి పని చేయండి, అది దానిని అంటే ఆ పాపాన్ని తుడిచివేస్తుంది, మరియు ప్రజలతో మంచి నడవడికతో (చక్కని ప్రవర్తనతో) వ్యవహరించండి."٨
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు విషయాల గురించి ఆజ్ఞాపిస్తున్నారు: మొదటిది: ఎల్లప్పుడూ అల్లాహ్ పట్ల భయభక్తులు (తఖ్వా) కలిగి ఉండటం. అది, ప్రతి ప్రదేశంలోనూ, ప్రతి కాలంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ , గోప్యంగానూ మరియు బహిరంగంగానూ, ఆరోగ్యంగా ఉన్నప్పుడూను మరియు కష్టాలలో ఉన్నప్పుడూను, విధిగావించిన వాటిని ఆచరించటం మరియు నిషేధించబడిన వాటికి దూరంగా ఉండటం వలన సాధ్యమగును. రెండవది: నీవు ఏదైనా ఒక చెడు పని చేసినట్లయితే, వెంటనే దాని తర్వాత ఒక మంచి పని చేయి — అది నమాజు (సలాహ్), దానధర్మం, సత్కార్యం, బంధుత్వాలు కలపడం (అంటే సత్సంబంధాలు నెలకొల్పడం), పశ్చాత్తాపం లేదా ఇతరత్రా ఏదైనా మంచి పని కావచ్చు—నిశ్చయంగా అది ఆ చెడు పనిని తుడిచివేస్తుంది (అంటే ప్రక్షాళన చేస్తుంది). మూడవది: ప్రజలతో మంచి నడవడికతో వ్యవహరించు, అందులో వారి ముఖాలపై చిరునవ్వు చిందించడం, దయ, మృదుత్వం, మేలు చేయడం మరియు బాధను తొలగించడం వంటివి అందులో ఉన్నాయి.
అబీ బక్రత రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రస్తావిస్తుండగా నేను విన్నాను: “ఇద్దరు ముస్లిములు, కత్తులు దూసి ఒకరిపై నొకరు దాడికి దిగితే, వారిలో చంపిన వాడూ మరియు చనిపోయిన వాడూ ఇద్దరూ నరకాగ్నిలో వేయబడతారు”. అది విని నేను “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ! చంపిన వాడి కొరకు అది సరియైనదే, మరి చనిపోయినవాడి గురించి ఎలా?” అని ప్రశ్నించాను. దానికి వారు “అవకాశం దొరికితే తన తోటి వాడిని చంపాలనే అతడు ఆశించినాడు”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు, ‘ఎదుటి వాడిని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో ఇద్దరు ముస్లిములు కత్తులతో ఒకరిపై నొకరు దాడికి దిగితే, చంపినవాడు నరకంలో వేయబడతాడు. ఎందుకంటే, నేరుగా ఇతడు, అతడిని చంపినాడు కనుక’ సహచరులు ప్రశ్నించారు “మరి చనిపోయిన వాడు నరకంలో ఎలా వేయబడతాడు?” అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “(అవకాశం దొరికితే) ఎదుటి వాడిని చంపాలనే అతడి ఉద్దేశ్యం కారణంగా అతడు కూడా నరకంలో వేయబడతాడు. చంపిన వాని చురుకుదనం, అతడి ముందంజ మరియు సఫల యత్నం తప్ప, చనిపోయిన వాడిని మరింకేదీ నిరోధించలేదు” అని తెలియ జేసినారు.
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం (వాటి వెనుక ఉండే) సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో. కనుక ఎవరి 'హిజ్రత్' కేవలం అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని కొరకు చేయబడుతుందో, ఆ హిజ్రత్ కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆయన సందేశహరుని కొరకు చేసినదిగా భావించబడుతుంది. ఎవరి హిజ్రత్ ఈ ప్రపంచపు సౌఖ్యాలను, సదుపాయాలను పొందడానికి లేదా ఏ స్త్రీనైనా వివాహం చేసుకోవడానికి చేయబడుతుందో, అతని హిజ్రత్ దాని కొరకు చేసిన హిజ్రత్ గానే భావించబడుతుంది, దేని కొరకైతే అతడు సంకల్పించినాడో." (హిజ్రత్ - తన స్వస్థలాన్ని లేక స్వదేశాన్ని వదిలి పూర్తిగా వేరే కొత్త ప్రదేశానికి వలస వెళ్ళిపోవుట). బుఖారీ గ్రంథములో ఈ పదాలున్నాయి: ""నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో".
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు – ఆచరణలు అన్నీ వాటి వెనుక ఉండే సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. ఈ నియమం సాధారణంగా ఆచరణలు అన్నింటికీ వర్తిస్తుంది – అవి ఆరాధనలకు సంబంధించిన ఆచరణలు గానీ లేక సాధారణ వ్యవహారాలకు సంబంధించిన ఆచరణలు గానీ. కనుక ఎవరైనా తాను చేసే పని ద్వారా ఏదైనా ప్రయోజనం లేదా లాభం పొందాలని సంకల్పించి ఉంటే, అతనికి ఆ ప్రయోజనం తప్ప పుణ్యఫలం ఏమీ లభించదు. అలాగే ఎవరైనా తాను చేసే పని కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క సామీప్యం పొందే, ఆయన కరుణ పొందే సంకల్పము తో చేసి ఉంటే, అతనికి దాని ప్రతిఫలం మరియు పుణ్యఫలం లభిస్తాయి, అది తినడం లేక తాగడం లాంటి సాధారణ ఆచరణ అయినా సరే. ఆచరణలలో ‘సంకల్పము’ యొక్క ప్రాధాన్యత మరియు దాని ప్రభావాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ ద్వారా విశదీకరిస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల ‘హిజ్రత్’ (తన స్వస్థలాన్ని వదిలి శాస్వతంగా వేరే కొత్త ప్రదేశానికి వలస వెళ్ళుట) బాహ్యంగా చూడడానికి ఒకేలా కనిపించినా – ఎవరైతే కేవలం తన ప్రభువైన అల్లాహ్ యొక్క సంతుష్ఠి కొరకు, ఆయన సామీప్యం మరియు కరుణ పొందుటకు వలస వెళ్ళిపోవాలని సంకల్పిస్తాడో, అది షరియత్’కు అనుగుణంగా చేయబడిన ‘హిజ్రత్’ (వలస) గా స్వీకరించబడుతుంది. అతని సంకల్పములోని స్వచ్ఛత కారణంగా అతడికి పుణ్యఫలం లభిస్తుంది. అలాగే, ఎవరైతే తాను చేసే హిజ్రత్ (వలస వెళ్ళిపోవుట) ద్వారా ఏదైనా ప్రాపంచిక ప్రయోజనం పొందుట సంకల్పించి ఉంటే, అంటే ఉదాహరణకు ధనం సంపాదించుట కొరకు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుట కొరకు, లేదా వ్యాపారం కొరకు, లేదా ఆ ప్రదేశపు స్త్రీని వివామాడుట కొరకు సంకల్పించి ఉంటే, అతడికి అతడు ఆశించిన ప్రయోజనం తప్ప మరేమీ లబించదు. హిజ్రత్ పుణ్యఫలంలో అతడికి ఏమాత్రమూ భాగం ఉండదు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను “నాకు ఏమైనా బోధించండి” అని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “కోపం తెచ్చుకోకు” (కోపానికి దూరంగా ఉండు) అని పలికారు. అతడు పలుమార్లు అదే ప్రశ్నను అడిగాడు. ప్రతీ సారీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “కోపం తెచ్చుకోకు” (కోపానికి దూరంగా ఉండు) అని సమాధానమిచ్చారు.
అల్ బుఖారీ నమోదు చేసినారు:సహబాలలో ఒకరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, తనకు ప్రయోజనం కలిగించే ఏదైనా విషయం వైపునకు మార్గదర్శకత్వం చేయమని కోరాడు. దానికి ఆయన “కోపం తెచ్చుకోకు (కోపానికి దూరంగా ఉండు)” అని అతణ్ణి ఆదేశించారు. దాని అర్థము తనను కోపానికి గురిచేసే ప్రతి కారణము నుండి దూరంగా ఉండమని, ఒకవేళ కోపం వచ్చినట్లయితే దానిని నియంత్రించు కోవాలని. అంతే గానీ, దానినే అంటిపెట్టుకుని ఉండి ఆ కోపంలో ఎవరినైనా చంపడమో, కొట్టడమో లేక అవమాన పరచడమో చేయరాదు అని అర్థము. ఆ మనిషి తనకు ఏదైనా బోధించమనే తన అభ్యర్ధనను పలుమార్లు పునరావృతం చేసాడు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “కోపం తెచ్చుకోకు (కోపానికి దూరంగా ఉండు)” అనే తన ఆదేశానికి ఇంకేమీ జోడించలేదు.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా ఆయన విన్నారు: “మీరు అల్లాహ్ పై ‘తవక్కల్’ (భరోసా) ఉంచవలసిన విధంగా ‘తవక్కల్’ కలిగి ఉంటే, ఆయన పక్షులకు ప్రసాదించిన విధంగా మీకూ రిజ్’ఖ్ ను (ఉపాధిని) ప్రసాదిస్తాడు. అవి ఉదయం తమ గూళ్ళ నుండి ఆకలితో బయలు దేరుతాయి, సాయంత్రం నిండిన పొట్టలతో సంతృప్తిగా తిరిగి వస్తాయి.”
అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధిస్తున్నారు – ప్రాపంచిక వ్యవహారాలలో గానీ లేక ధర్మానికి సంబంధించిన వ్యవహారాలలో గాని - ప్రయోజనం పొందేందుకు, కీడును లేక హాని కలుగజేసే వాటిని దూరం చేసేందుకు - మనం అన్ని వేళలా అల్లాహ్ పై ‘తవక్కల్’ను (దృఢమైన సంపూర్ణ నమ్మకాన్ని, భరోసాను) కలిగి ఉండాలి. ఎందుకంటే, ఎవరూ కూడా దేనినీ ప్రసాదించలేరు, దేనినీ ఆపి ఉంచలేరు, హాని కలిగించలేరు లేదా ప్రయోజనం కలిగించలేరు, కేవలం పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ తప్ప. ఇంకా ఇలా తెలియజేస్తున్నారు – ప్రయోజనం పొందడానికి లేదా కీడును, హానిని దూరం చేయడానికి వినియోగించే వనరులను, సాధనాలను, విధానాలను అల్లాహ్ నందు పూర్తి ‘తవక్కల్’తో (సంపూర్ణ విశ్వాసముతో, నమ్మకముతో, భరోసాతో) వినియోగించాలి. మనం ఎపుడైతే అలా చేస్తామో, పక్షులకు ప్రసాదించిన మాదిరిగా అల్లాహ్ మనకూ రిజ్’ఖ్ ను (ఉపాధిని) ప్రసాదిస్తాడు; ఎలాగైతే అవి ఉదయం తమ గూళ్ళ నుండి ఆకలితో బయలుదేరి, సాయంత్రం నిండిన పొట్టలతో సంతృప్తిగా తిరిగి వస్తాయో ఆ విధంగా. పక్షుల యొక్క ఈ చర్య ఉపాధిని పొందడానికి తగిన సాధనాలను వినియోగించాలి అనడానికి ఒక ఉదాహరణ, అంతే గానీ కేవలం భరోసాతో సోమరిపోతుగా ఉండి పోవడం తగదు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “సర్వ శక్తిమంతుడు, మహోన్నతుడు అయిన తన ప్రభువు ఇలా ప్రవచించినాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికారు: “నా దాసుడు ఒకడు పాపపు పని చేసినాడు. తరువాత ఇలా వేడుకున్నాడు “ఓ అల్లాహ్, నా ఈ పాపాన్ని క్షమించు.” అపుడు పరమ పవితృడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికాడు “నా దాసుడు పాపపు పని చేసాడు, తరువాత తనకొక ప్రభువు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన తన పాపాలను క్షమిస్తాడని మరియు పాపపు పనులకు పాల్బడితే శిక్షిస్తాడని గ్రహించాడు. తరువాత అతడు మళ్ళీ పాపపు పని చేసాడు. అతడు మళ్ళీ ఇలా వేడుకున్నాడు “ఓ నా ప్రభూ! నా ఈ పాపాన్ని క్షమించు”. అపుడు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికాడు “నా దాసుడు పాపపు పని చేసాడు, తరువాత తనకొక ప్రభువు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన తన పాపాలను క్షమిస్తాడని, మరియు పాపపు పనులకు పాల్బడితే శిక్షిస్తాడని గ్రహించాడు. నేను నా దాసుణ్ణి క్షమించాను. అతడు ఏమి చేయ దలుచుకుంటే అది చేయనివ్వండి”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు నుండి ఇలా ఉల్లేఖించినారు – ఒకవేళ అల్లాహ్ యొక్క దాసుడు ఏదైనా పాపపు పనికి ఒడిగట్టి, ఆ తరువాత అల్లాహ్ ను ‘ఓ అల్లాహ్ నా ఈ పాపాన్ని క్షమించు’ అని వేడుకున్నట్లయితే, దానికి అల్లాహ్ ఇలా పలుకుతాడు ‘నా దాసుడు పాపపు పనికి ఒడిగట్టినాడు, అతడికి తెలుసు అతనికి ఒక ప్రభువు ఉన్నాడని, ఆయన పాపాల్ను క్షమిస్తాడని, వాటిని కప్పివేస్తాడని, వాటిని చూసీ చూడనట్టు వదిలి వేస్తాడని – లేక పాపపు పనులకు పాల్బడినందుకు శిక్షిస్తాడని. కాబట్టి నేను అతడిని క్షమించాను. తరువాత, అల్లాహ్ యొక్క దాసుడు తిరిగి ఏదైనా పాపపు పనికి ఒడిగట్టి, తరువాత తిరిగి అల్లాహ్ ను ‘ఓ అల్లాహ్ నా ఈ పాపాన్ని క్షమించు’ అని వేడుకున్నట్లయితే, అల్లాహ్ ఇలా పలుకుతాడు ‘నా దాసుడు పాపపు పనికి ఒడిగట్టినాడు, అతడికి తెలుసు అతనికి ఒక ప్రభువు ఉన్నాడని, ఆయన పాపాల్ను క్షమిస్తాడని, వాటిని కప్పివేస్తాడని, వాటిని చూసీ చూడనట్టు వదిలి వేస్తాడని – లేక పాపపు పనులకు పాల్బడినందుకు శిక్షిస్తాడని. కాబట్టి నేను నా దాసుణ్ణి క్షమించాను. తరువాత, అల్లాహ్ యొక్క దాసుడు తిరిగి ఏదైనా పాపపు పనికి ఒడిగట్టి, తరువాత తిరిగి అల్లాహ్ ను ‘ఓ అల్లాహ్ నా ఈ పాపాన్ని క్షమించు’ అని వేడుకున్నట్లయితే, అల్లాహ్ ఇలా పలుకుతాడు ‘నా దాసుడు పాపపు పనికి ఒడిగట్టినాడు, అతడికి తెలుసు అతనికి ఒక ప్రభువు ఉన్నాడని, ఆయన పాపాలను క్షమిస్తాడని, వాటిని కప్పివేస్తాడని, వాటిని చూసీ చూడనట్టు వదిలి వేస్తాడని – లేక పాపపు పనులకు పాల్బడినందుకు శిక్షిస్తాడని. కాబట్టి నేను నా దాసుణ్ణి క్షమించాను. కనుక, అతడు పాపపు పనికి ఒడిగట్టిన ప్రతిసారీ దానిని విడిచిపెట్టి, దానికి పాల్బడినందుకు హృదయపూర్వకంగా పాశ్చాత్తాపపడి, తిరిగి ఆ పనికి ఒడిగట్టనని తీర్మానించు కున్నట్లయితే, అతడు ఏమి చేయ దలుచుకుంటే అది చేయనివ్వండి. కాని అతడి ఆత్మ అతడిని లోబరుచుకుంటుంది, దానితో తిరిగి అతడు పాపపు పనిలో పడిపోతాడు. అటువంటి పాపపు పనికి ఒడిగట్టిన ప్రతిసారీ అతడు హృదయపూర్వకంగా పశ్చాత్తాప పడినంత కాలము నేను అతడిని క్షమిస్తాను. ఎందుకంటే, పశ్చాత్తాపము పూర్వము జరిగిన దానిని తుడిచివేస్తుంది.