





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “మీ వస్త్రాలలో తెల్లని వస్త్రాలను ధరించండి, ఎందుకంటే అవి మీ దుస్తులలో ఉత్తమమైనవి; మరియు మీ మృతుడిని వాటితో కప్పండి."
అబూ దావూద్, అత్తిర్మిదీ మరియు ఇబ్నెమాజహ్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పురుషులు తెల్లటి దుస్తులు ధరించాలని మరియు చనిపోయిన వారిని వాటితో కప్పాలని ఆదేశించారు, ఎందుకంటే నిశ్చయంగా అవి ఉత్తమమైన దుస్తులలో ఉన్నాయి.
జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: మేము ఒక యుద్ధంలో ఉన్నాము. అప్పుడు ఒక ముహాజిర్ ఒక అన్సారీని వెనుక నుండి కొట్టాడు. దాంతో ఆ అన్సారీ ‘ఓ అన్సారులారా!’ అని, ఆ ముహాజిర్ ‘ఓ ముహాజిర్లారా!’ అని కేకలు వేశారు. అల్లాహ్ ఈ విషయాన్ని తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వినిపించాడు. ఆయన ‘ఇదేమిటి?’ అని అడిగారు. దానికి వారు, ‘ఒక ముహాజిర్ ఒక అన్సారీని వెనుక నుండి కొట్టాడు, అప్పుడు అన్సారీ ‘ఓ అన్సారులారా!’ అని, ముహాజిర్ ‘ఓ ముహాజిర్లారా!’ అని కేకలు వేశారు’ అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘దీనిని వదిలేయండి, నిశ్చయంగా ఇది దుర్గంధ భరితమైనది’. జాబిర్ ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (మదీనాకు) వచ్చినప్పుడు అన్సారీల సంఖ్య ఎక్కువగా ఉండేది, ఆ తర్వాత ముహాజిర్ల సంఖ్య పెరిగింది. అప్పుడు అబ్దుల్లా బిన్ ఉబై ఇలా అన్నాడు: వారు ఇలా చేశారా? అల్లాహ్ సాక్షిగా! మనం మదీనాకు తిరిగి వెళ్ళిన తర్వాత, గౌరవనీయులు నీచులను అక్కడి నుండి తప్పక వెళ్ళగొడతారు. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఓ ప్రవక్తా! నన్ను అనుమతించండి, నేను ఈ కపటుడి మెడ నరుకుతాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘అతనిని వదిలేయ్, ముహమ్మద్ తన సహచరులనే చంపుతున్నాడని ప్రజలలో మాట వ్యాపించకుండా ఉండేందుకు’.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక యుద్ధ యాత్రలో తన సహచరులైన ముహాజిర్లు మరియు అన్సార్లతో (రదియల్లాహు అన్హుమ్) కలిసి ప్రయాణిస్తుండగా, ముహాజిర్లలోని ఒక వ్యక్తి అన్సార్లలోని ఒక వ్యక్తి పిరుదులపై తన చేతితో కొట్టాడు. అప్పుడు అన్సారీ, 'నాకు సహాయం చేయండి ఓ అన్సారులారా' అని, మరియు ముహాజిర్, 'నాకు సహాయం చేయండి ఓ ముహాజిరులారా' అని పిలవగా, దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విని, 'ఇదేమిటి?' అని పలికారు. వారు ఇలా అన్నారు: ముహాజిర్ లకు చెందిన ఒక వ్యక్తి, అన్సార్ లకు చెందిన ఒక వ్యక్తిని వెనుక భాగంపై తన చేతితో కొట్టాడు, అప్పుడు ఆ అన్సారీ, ‘ఓ అన్సారులారా! నన్ను ఆదుకోండి’ అని అన్నాడు, మరియు ఆ ముహాజిర్, ‘ఓ ముహాజిరులారా! నన్ను ఆదుకోండి’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఈ అజ్ఞాన కాలపు అలవాటును విడిచిపెట్టండి, ఎందుకంటే ఇది నీచమైనది, అసహ్యకరమైనది మరియు బాధాకరమైనది; అదేమిటంటే, ఒక వ్యక్తి తన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయినప్పుడు, అతను తన జాతి వారిని పిలుస్తాడు, అప్పుడు వారు, అతను అన్యాయం చేసేవాడైనా లేదా అన్యాయానికి గురైనవాడైనా సరే, తమ అజ్ఞానం మరియు గుడ్డి పక్షపాతం కారణంగా అతనికి సహాయం చేయడానికి పరుగెత్తుకు వస్తారు.” జాబిర్ తెలిపారు: ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ హిజ్రత్ చేసి మదీనా వచ్చినప్పుడు అన్సారులు ఎక్కువగా ఉండేవారు, ఆ తర్వాత ముహాజిర్లు ఎక్కువయ్యారు. అప్పుడు కపటుల సర్దారు అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సలూల్ ఇలా పలికాడు: "విషయం ఈ స్థాయికి చేరిందా?! అల్లాహ్ సాక్షిగా, మనం మదీనాకు తిరిగి వెళ్ళిన తరువాత గౌరవనీయులమైన మనం - అంటే నేను మరియు నాతో ఉన్నవారు - మదీనా నుండి నీచులను - అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయనతో ఉన్నవారు - తప్పకుండా వెళ్ళగొడతాము. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు, "ఓ ప్రవక్తా! నన్ను వదిలి వేయండి, ఈ కపటవిశ్వాసి మెడ నేను నరుకుతాను" అని అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, "అతన్ని వదిలిపెట్టు. ప్రజలు 'ముహమ్మద్ తన అనుచరులనే చంపుతున్నాడు' అని మాట్లాడుకోకూడదు" అని సెలవిచ్చారు.
‘అబ్దుల్లా ఇబ్నె మసూద్ (రజియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక గడ్డి చాప మీద నిద్రిస్తున్నారు, తరువాత ఆయన లేచారు, ఆ చాప ఆయన ప్రక్కలపై తన గుర్తులు వదిలింది. మేము ఇలా అన్నాము: ఓ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం), మేము మీ కొరకు ఒక పరుపును తీసుకువస్తాము”, అపుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నాకు ఈ ప్రపంచంతో సంబంధం ఏమిటి? నేను ఈ ప్రపంచంలో ఒక చెట్టు కింద ఆశ్రయం పొంది, ఆ తరువాత వెళ్ళిపోయే ఒక రౌతు లాగా ఉన్నాను”.
అత్తిర్మిదీ మరియు ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు:అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊ ద్ (రదియల్లాహు అన్హు) ఇలా పేర్కొంటున్నారు - ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొన్ని రెల్లుగడ్డి పుల్లలతొ నేసిన చిన్న చాపపై పడుకున్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దానిపై నుండి లేచినపుడు ఆ చాప పుల్లల గుర్తులు వారి ప్రక్కలపై వదిలివేయబడి ఉండడాన్ని చూసి మేము ఇలా అన్నాము: “ఓ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మేము మీ కొరకు ఒక మెత్తని పరుపును తయారు చేసి తీసుకు వస్తాము. అది ఈ రెల్లు గడ్డి చాప కన్నా మీరు పడుకోవడానికి మంచిగా ఉంటుంది. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: దాని వైపునకు ఆకర్షితుడనై అది కావాలి అనుకునేటంత ప్రేమ, అభిమానము నాకు ఈ ప్రపంచం పట్ల లేవు. ఈ ప్రపంచంలో నా స్థితి మరియు దానిలో నా మనుగడ అనేది ఒక చెట్టు కింద ఆశ్రయం పొంది, ఆ తరువాత దానిని వదిలి వెళ్లిపోయే రౌతు లాంటిది.
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి వారు ఒక రోజులో రెండు పూటల భోజనం చేస్తే, అందులో ఒకటి కేవలం ఖర్జూరాలు మాత్రమే ఉండేవి.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారువిశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా నివేదించినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ సభ్యులు ఒక రోజులో రెండు పూటల భోజనం తినలేదు, ఒకవేళ తింటే, అందులో ఒక పూట ఖర్జూరం మాత్రమే ఉండేది.
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటివారు మదీనా వచ్చినప్పటి నుంచి ఎన్నడూ వరుసగా మూడు రోజుల పాటు కడుపునిండా గోధుమ రొట్టెలు తినలేదు. ఆయన మరణించేదాకా అదే పరిస్థితి.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారువిశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా నివేదించినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి వారు మదీనా వచ్చినప్పటి నుంచి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరణించేంత వరకు, వరుసగా మూడు రోజుల పాటు గోధుమ రొట్టెలు కడుపునిండా తినలేదు.
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (పడుకునే) పరుపు తోలుతో తయారుచేయబడింది. దానిలో పలుచటి ఖర్జూర చెట్ల బెరడు నింపబడి ఉండేది. మరియు ముస్లిం ఉల్లేఖన ప్రకారం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆనుకునే దిండు తోలుతో తయారుచేయబడింది, దానిలో పలుచటి ఖర్జూర చెట్ల బెరడు నింపబడి ఉండేది.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారువిశ్వాసుల మాతృమూర్తి ఆయషా రదియల్లాహు అన్హా తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రించే పరుపు తోలుతో తయారు చేయబడింది, మరియు దానిలో ఖర్జూర చెట్ల బెరడు నింపబడి ఉండేది. ఆయన ఆనుకునే తలగడ కూడా అదే విధంగా ఉండేది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బావమరిది, ఉమ్ముల్ ముమినీన్ జువైరియహ్ బింతె అల్-హారిథ్ సోదరుడైన అమర్ ఇబ్నె అల్-హారిథ్ రదియల్లాహు అన్హుమ్ ఇలా పలికినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు తన తెల్లని కంచరగాడిదను, తన ఆయుధాలను మరియు దానంగా ఇచ్చిన భూమిని మాత్రమే వదలి వెళ్ళారు. ఇవి తప్ప ఆయన ఒక్క దిర్హముగాని, దీనారుగాని, బానిసగాని, బానిసరాలిని గాని, మరే వస్తువును కూడా వదలి వెళ్ళలేదు.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు, తాను స్వారీ చేసే తన తెల్లని కంచరగాడిదను, తాను ధరించే తన ఆయుధాలను మరియు ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాటసారుల కోసం దానం చేసిన కొంత భూమిని మాత్రమే వదలివెళ్ళారు. ఇవి తప్ప ఆయన వెండి దిర్హముగానీ, బంగారు దీనారు గానీ, బానిస గానీ, బానిసరాలిని గానీ, మేకలను గానీ, ఒంటెలను గానీ లేదా మరే ఇతర సంపదను గానీ వదలి వెళ్ళలేదు.
అనస్ ఇబ్నె మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్ములను ఉద్దేశ్యించి ఎప్పుడు ప్రసంగించినా ఇలా అనకుండా ఎప్పుడూ లేరు: “చిత్తశుధ్ధి (నైతిక నిష్ట, న్యాయవర్తన) లేని వానికి విశ్వాసం లేదు; మరియు (ఇతరులతో) తనకు ఉన్న ఒడంబడికను పాటించని వ్యక్తికి ధర్మం లేదు.”
ఆహ్మద్ నమోదు చేసినారు:అనస్ ఇబ్నె మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రెండు విషయాలను ప్రస్తావించకుండా ఉపన్యాసం లేదా ఉపదేశాన్ని ఇవ్వడం చాలా అరుదు. మొదటిది: ఎవరి విషయంలోనైనా - అతని సంపద, లేదా అతని కుటుంబము విషయంలో ద్రోహం చేయాలనే తలంపు మనసులో ఉన్న వ్యక్తికి పూర్తి విశ్వాసం ఉండదు. రెండవది: ఇతరులతో తనకు ఉన్న, లేదా ఇతరులతో తాను చేసుకున్న ఒప్పందాలను, ఒడంబడికను పాటించని వ్యక్తికి సంపూర్ణమైన ధర్మము లేదు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ కూర్చుని ఉన్న కొందరు వ్యక్తుల వద్ద ఆగి, ఇలా పలికినారు: “మీలో ఉత్తములు ఎవరో, అధములు ఎవరో నేను మీకు తెలియజేయనా?” దానికి వారు నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు ఆయన ఆ మాటను మూడుసార్లు పునరావృతం చేసారు. అప్పుడు ఒక వ్యక్తి, “తప్పకుండా ఓ రసూలుల్లాహ్! మాలో ఉత్తములు ఎవరో, అధములు ఎవరో మాకు తెలియజేయండి” అని అన్నారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు: «మీలో ఉత్తముడు ఎవరంటే, అతని నుండి మేలు ఆశించబడుతుంది మరియు అతని కీడు నుండి భద్రత లభిస్తుంది. మరియు మీలో అధముడు ఎవరంటే, అతని నుండి మేలు ఆశించబడదు మరియు అతని కీడు నుండి భద్రత లభించదు».
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చుని ఉన్న తన సహాబాలలో కొందరి వద్ద నిలబడి వారిని ఇలా అడిగారు: మీలో ఉత్తములు ఎవరో మరియు అధములు ఎవరో నేను మీకు తెలియజేయనా? తమలో ఎవరు ఉత్తములో, ఎవరు అధములో తేలిపోతుందనే భయంతో మరియు అవమానం పాలవుతామేమో అనే భీతితో వారు ఏమీ మాట్లాడకుండా, జవాబివ్వకుండా మౌనంగా ఉండిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారి ముందు ఆ ప్రశ్నను మూడు సార్లు పునరావృతం చేయగా, వారిలో నుండి ఒక వ్యక్తి ఇలా సమాధానమిచ్చాడు: తప్పకుండా ఓ రసూలుల్లాహ్! సల్లల్లాహు అలైహి వసల్లం, మాలో మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో మాకు తెలియజేయండి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఈ విధంగా వివరించారు: “మీలో ఉత్తములు ఎవరంటే – ఎవరి నుండి అయితే మేలు, దయ మరియు సత్కార్యాలు ఆశించబడతాయో, ఎవరి కీడు నుండైతే భద్రత ఉంటుందో, మరియు అతని దౌర్జన్యం, కీడు మరియు అన్యాయం నుండి ప్రజలు భయపడకుండా ఉంటారో. మరియు మీలో అధములు ఎవరంటే – ఎవరి నుండి అయితే ఎటువంటి మేలు, దయ మరియు సత్కార్యాలు ఆశించబడవో, ఎవరి కీడు నుండైతే భద్రత ఉండదో, బదులుగా అతని దౌర్జన్యం, కీడు మరియు అన్యాయం నుండి ప్రజలు భయపడతారో”.