





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నా నుండి ఇతరులకు చేరవేయండి, అది ఒక్క వాక్యమైనా సరే. ఇస్రాయీలు సంతతి వారి నుండి కూడా ఉల్లేఖించండి, అందులో అభ్యంతరము ఏమీ లేదు. (అయితే తెలుసుకోండి) ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నాకు అబద్దాలను అంటగడతాడో, అతడు తన స్థానాన్ని నరకాగ్నిలో స్థిర పరుచుకున్నట్లే".
అల్ బుఖారీ నమోదు చేసినారు:దివ్య ఖుర్’ఆన్ నుంచైనా లేదా సున్నతుల నుంచి అయినా సరే (నేర్చుకున్న) ఙ్ఞానాన్ని ఇతరులకు చేర వేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశిస్తున్నారు, అది కొద్దిపాటి ఙ్ఞానమైనా సరే, అంటే దివ్య ఖుర్’ఆన్ నుండి ఒక వాక్యమైనా లేక ఒక హదీసు అయినా సరే. అయితే నియమము ఏమిటంటే అతడు ఏమి చేరవేస్తున్నాడో లేదా దేని వైపునకు ఇతరులను ఆహ్వానిస్తున్నాడో, దాని గురించి అతడు స్వయంగా పూర్తి ఙ్ఞానమూ, అవగాహనా కలిగి ఉండాలి. తరువాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రాయీలు సంతతి వారినుంచి కూడా ఉల్లేఖించవచ్చని, అందులో అభ్యంతరము ఏమీ లేదని వివరించినారు. అంటే దాని అర్థము, వారికి ఏమి జరిగినది అనే విషయాలను గురించి. అయితే అవి (ఆ ఉల్లేఖనలు) మన షరియత్’కు వ్యతిరేకమైనవి కాకూడదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనపై అబద్దాలాడుట గురించి హెచ్చరించినారు మరియు ఎవరైతే తనపై ఉద్దేశ్యపూర్వకంగా అసత్యాలను ప్రచారం చేస్తాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో స్థిరపరుచుకున్నట్లే అని తెలిపినారు.
మిఖ్'దాం బిన్ మ’అదీ కరిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు : “జాగ్రత్త! రాబోయే కాలంలో ఒక వ్యక్తికి నా హదీసు చేరుతుంది. అతడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్యన అల్లాహ్ గ్రంథం ఉన్నది. అందులో హలాల్ గా ప్రకటించ బడినదంతా మేము హలాల్ గా భావిస్తాము మరియు అందులో హరాంగా ప్రకటించ బడినదంతా మేము హరాం గా భావిస్తాము”. (ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు) “జాగ్రత్త! అల్లాహ్ యొక్క సందేశహరుడు దేనినైతే హరాంగా ప్రకటించినాడో, అది అల్లాహ్ హరాంగా ప్రకటించిన దానితో సమానం”.
అబూ దావూద్, అత్తిర్మిదీ మరియు ఇబ్నెమాజహ్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సమీప భవిష్యత్తులో ఇలాంటి ఒక కాలం రాబోతున్నది. అందులో – కొంత మంది ప్రజలు కూర్చుని ఉంటారు, ఒకడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఉంటాడు. అతనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీసు తెలియజేయబడుతుంది. దానికి అతడు ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్య తీర్పు చెప్పేది ఏదైనా ఉంది అంటే అది ‘అల్ ఖుర్’ఆన్ అల్ కరీం’. అది చాలు మాకు. అందులో మాకు ఆచరించవలసిన విషయాలుగా (హలాల్ విషయాలుగా) కనిపించిన అంతటిపై మేము ఆచరిస్తాము, మరియు అందులో నిషేధించబడిన విషయాలుగా (హరాం విషయాలుగా) కనిపించిన దానినుండి దూరంగా ఉంటాము. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించినారు – తన సున్నత్’లో తాను నిషేధించిన ఏ విషయమైనా లేదా తాను నిరోధించిన ఏ విషయమైనా, అది అల్లాహ్ తన గ్రంథములో నిషేధిస్తూ ఆదేశించిన దానితో సమానం. ఎందుకంటే ప్రతిదీ తాను తన ప్రభువు నుండే అంద జేస్తున్నాడు గనుక.
అల్ ఇర్బాజ్ ఇబ్న్ సారియహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక రోజు మా మధ్యన (కూర్చుని) ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడినారు. నిలబడి హితబోధ చేసినారు. ఆ హితబోధ మా హృదయాలను భయంతో కంపించేలా చేసింది, మా కళ్ళనుండి కన్నీళ్ళు వచ్చేలా చేసింది. మాలో ఒకరు ఇలా అన్నారు: “మీరు చేసిన హితబోధ, శాశ్వతంగా విడిచి వెళ్ళబోతున్న వారు చేసిన హితబోధలా ఉన్నది. మా కొరకు ఏదైనా ప్రమాణాన్ని ఉపదేశించండి”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు భయపడండి, మరియు ఒకవేళ మీపై ఒక హబషీయుడిని (బానిసను) అధికారిగా నియమించినా సరే ఆయనను అనుసరించండి. నా తరువాత మీలో జీవించి ఉన్న వారు తీవ్రమైన విబేధాలు చూస్తారు. కనుక నా సున్నత్’ను మరియు సన్మార్గగాములైన ఖలీఫాల (ఖులాఫా అర్రాషిదీన్ అల్ మహిదియ్యీన్ ల) సున్నత్’ను అంటిపెట్టుకుని ఉండండి; మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకుని ఉండండి. (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి; ఎందుకంటే (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే ప్రతి విషయమూ మార్గభ్రష్ఠత్వమే.”
అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీథు ద్వారా తెలుస్తున్న విషయము: తన సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దినము హితబోధ చేసినారు. ఆ హితబోధ అక్కడ ఉన్న వారి హృదయాలను కంపింపజేసింది, వారి కళ్ళలో కన్నీళ్ళు వచ్చేలా చేసింది. ఆ హితబోధలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన విషయాల గాంభీర్యం, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగించిన తీరు చూసి వారు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ ఇది (మీరు చేసిన హితబోధ) శాశ్వతంగా వీడిపోతున్న వారు చేసిన హితబోధలా ఉన్నది”. కనుక తమ కొరకు ఏదైనా ప్రమాణాన్ని, ఆయన తరువాత దానికి కట్టుబడి ఉండేలా ఆదేశించమని కోరినారు. దానికి ఆయన ఇలా అన్నారు: “మీకోరకు ఇది నా హితబోధ (వసియ్యహ్); అల్లాహ్ వీధి చేసిన విషయాలను ఆచరిస్తూ, ఆయన నిషేధించిన విషయాలకు దూరంగా ఉంటూ, అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి.” మాట వినుట మరియు అనుసరించుట: అంటే అమీరుల (పాలకుల) మాట వినుట మరియు వారిని అనుసరించుట అని అర్థము. బానిస అయినా సరే పాలకునిగా నియమించబడినా, లేక వారి విషయాల నియంత్రణ కొరకు నియమించబడినా అతని మాట వినాలి, అతడిని అనుసరించాలి. అంటే మరో మాటలో సృష్టి మొత్తములో అందరి కంటే అధమ స్థాయికి చెందిన వాడు అయినా సరే పాలకునిగా నియమించబడితే దానిని వ్యతిరేకించకండి, అతడిని అనుసరించండి. వ్యతిరేకత వివాదాలను, కలహాలను రేకిత్తిస్తుంది, రెచ్చగొడుతుంది. ఎందుకంటే (నా తరువాత) మీలో జీవించి ఉన్న వారు తీవ్రమైన విబేధాలు చూస్తారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తీవ్రమైన విబేధాలనుండి ఎలా బయటపడాలో వివరించారు – అది తన సున్నత్ ను మరియు తన తరువాత (షరియత్ మార్గదర్శనములో) సన్మార్గ గాములైన ఖలీఫాల సున్నత్ ను; అంటే అబూ బకర్ అస్సిద్దీఖ్, ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్, ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ మరియు అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ ల సున్నత్ ను అంటి పెట్టుకుని ఉండాలని, దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోవాలని అన్నారు. దీని అర్థం సున్నత్కు కట్టుబడి ఉండటం మరియు దానిని అనుసరించడం. ఈ పదాలు ఆ విషయం యొక్క ప్రాముఖ్యత మరియు దాని తీవ్రతను సూచిస్తున్నాయి. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మములో కొత్తగా ప్రవేశపెట్టబడే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి అని; ఎందుకంటే (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే ప్రతి విషయమూ మార్గభ్రష్ఠత్వమే అని హెచ్చరించినారు.
సమురా ఇబ్న్ జుందుబ్ మరియు ముగీరహ్ ఇబ్న్ షు’బహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా పేరున ఎవడైనా అసత్యమైనదిగా కనిపించే (అంటే ప్రవక్త (స) పలుకని) హదీథును ప్రస్తావించినట్లైతే అతడు ఇద్దరు అబధ్ధాలకోరులలో ఒకడు అవుతాడు.”
ముస్లిం తన ముఖద్దిమాలో నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే తన పేరున ఒక హదీథును – అది అబద్ధం అని తెలిసీ, లేక అబద్ధపు హదీసేమో అనే కొద్దిపాటి అనుమానం ఉన్నా; లేక ఇది ఖచ్చితంగా అబద్ధపు హదీథే అనే బలమైన అనుమానం ఉండి కూడా దానిని ప్రచారం చేసినట్లైతే అతడు వాస్తవానికి దానిని ప్రారంభించిన వానితో కలిసి ఈ అబద్ధములో పాల్గొంటున్న వాడు అవుతాడు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశద పరుస్తున్నారు: ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా తాను పలుకని మాటలను తన మాటలుగా, తాను ఆచరించని ఆచరణను తన ఆచరణగా తనకు ఆపాదించినట్లయితే – అతడు తనను గురించి అసత్యం పలుకుతున్నాడు. తీర్పు దినమున అటువంటి స్థానము నరకాగ్నిలో ఉంటుంది. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అసత్యం పలికినందుకు గాను అతనికివ్వబడే ప్రతిఫలం.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని ఉల్లేఖిస్తున్నారు: “నా ఉమ్మత్ యొక్క చివరి కాలములో (ఉమ్మత్’లోని) కొందరు మీరు గానీ, మీ తాతముత్తాతలు గానీ ఎన్నడూ వినని హదీథులను మీకు చెబుతారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మరియు వారి పట్ల జాగ్రత్త వహించండి."
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: తన ఉమ్మత్ యొక్క చివరి కాలములో (తన ఉమ్మత్’లోనే) కొందరు పుట్టుకొస్తారు. వారు అసత్యాలను సృష్ఠిస్తారు, మరియు అంతకు ముందు ఎవరూ చెప్పని విషయాలు చెబుతారు. వారు తప్పుడు హదీథులను, లేక కల్పించిన హదీథులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులుగా చెబుతారు. కనుక ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటువంటి వారినుండి దూరంగా ఉండమని, వారితో కూర్చో రాదని, వారి హదీథులను (సంభాషణలను, ఉపన్యాసాలను) వినరాదని ఆదేశిస్తున్నారు. లేకపోతే ఆ కల్పిత హదీసులు బయటకు తీయలేనంతగా ప్రజల మనసులలో నాటుకుని పోతాయి.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్న ప్రతి విషయాన్ని దానిని కంఠస్థం చేసుకునేందుకు వ్రాసి ఉంచుకునే వాడిని. దానికి ఖురైషీయులు ఇలా అంటూ నన్ను వారించేవారు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్న ప్రతి విషయాన్నీ రాస్తున్నావా? ఆయన మానవమాత్రుడు, ఆయన కోపంలోనూ మాట్లాడుతారు, అలాగే సంతోషంలోనూ మాట్లాడుతారు.” దానితో నేను రాయడం ఆపివేసినాను. (జరిగిన విషయాన్ని) తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ప్రస్తావించినాను. అపుడు వారు తన చేతి వేలితో తన నోటిని చూపుతూ ఇలా అన్నారు: “రాసిపెట్టుకుంటూ ఉండు (ఓ అబ్దుల్లాహ్)! ఎవరి చేతిలోనైతే నా ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా దీని నుండి (ఈ నోటినుండి) సత్యము తప్ప మరేమీ బయటకు రాదు.”
అబూదావూద్ నమోదు చేసినారు:అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్న ప్రతి విషయాన్ని రాసిపెట్టుకుంటూ ఉండే వాడిని, ఆ విధంగా రాతలో వాటిని భద్రపరిచి ఉంచుకునేందుకు గాను. కాని ఖురైషీయులు నన్ను వారిస్తూ, ఇలా అన్నారు: ‘రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కూాడా ఒక మానవమాత్రుడే (మనలాగే). ఆయన సంతోషములోనూ మాట్లాడుతారు, మరియు కోపములోనూ మాట్లాడుతారు. కనుక (మాటలలో) తప్పు జరగవచ్చు.” దానితో నేను రాయడం ఆపివేసినాను. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జరిగిన విషయాన్ని తెలియజేసినాను. అపుడు వారు వేలితో తన నోటిని చూపుతూ ఇలా అన్నారు: “రాయి (ఓ అబ్దుల్లాహ్!), ఎవరి చేతిలోనైతే నా ప్రాణాలున్నాయో, ఆయన సాక్షిగా దీని నుండి (ఈ నోటినుండి) ఏ స్థితిలో నైనా సత్యము తప్ప మరేమీ బయటకు రాదు, సంతోషపు స్థితిలోనైనా లేక కోపపు స్థితిలోనైనా.” ఖుర్’ఆన్’లో సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇలా పలికాడు: “వమా యన్’తిఖు అనిల్ హవా, ఇన్’హువ ఇలా వహ్యున్ యూహా) “అతను తన మనోవాంఛలను అనుసరించి మాట్లాడడు*. అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింప జేయబడిన వ'హీ (దివ్యజ్ఞానం) తప్ప మరింకేమీ కాదు.” (సూరహ్ అన్’నజ్మ్ 53:3,4)
అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ ఇబ్నుల్-ఖత్తాబ్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు:దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాంను ఒక పటిష్టమైన నిర్మాణంతో పోల్చారు, దాని ఐదు స్తంభాలు ఆ నిర్మాణానికి బలాన్ని, ఆధారాన్ని చేకూరుస్తాయి. ఇస్లాం యొక్క మిగతా విషయాలు ఆ నిర్మాణాన్ని పరిపూర్ణం చేస్తాయి. ఈ మూలస్తంభాలలో మొదటిది: “షహాదతైన్” (రెండు సాక్ష్యాపు వాక్యాలు ఉచ్చరించుట). “అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేరు” అని సాక్ష్యము పలుకుట, మరియు “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క సందేశహరుడు” అని సాక్ష్యం పలుకుట. ఈ రెండూ కలిసి ఒకే మూలస్తంభము; ఇవి ఒకదాని నుండి మరొకటి విడదీయరానివి. దాసుడు ఈ సాక్ష్యపు వాక్యాలు ఉచ్చరిస్తాడు, తద్వారా అతడు అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని, మరియు కేవలం ఆయన మాత్రమే ఆరాధనలకు నిజమైన అర్హుడని, ఆయన తప్ప మరింకెవ్వరూ అర్హులు కారని గుర్తిస్తున్నాడు మరియు అంగీకరిస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా అతడు, తాను ఉచ్చరించిన సాక్ష్యాపు వాక్యాలకు అనుగుణంగా ఆచరిస్తాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశాన్ని విశ్వసిస్తాడు మరియు ఆయనను అనుసరిస్తాడు. మూలస్తంభాలలో రెండవది: సలాహ్’ను స్థాపించుట. అంటే దినము మరియు రాత్రిలో విధిగా ఆచరించవలసిన ఐదు పూటల నమాజులను, వాటి నిర్ధారిత వేళల్లో, వాటికి సంబంధించిన నియమాలు, విధులు మరియు విధానాలను అనుసరిస్తూ ఆచరించుట; ఈ ఐదు: ఫజ్ర్, జుహ్ర్, అస్ర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు. మూడవ మూలస్థంభము: జకాతును విధిగా చెల్లించుట. ఇది ఒక ఆర్థికపరమైన ఆరాధన. షరియత్ లో నిర్ధారించబడిన ఒక స్థాయికి చేరిన సంపదపై జకాతు చెల్లించుట విధి. మరియు అట్టి జకాతు దానికి తగిన అర్హులకు ఇవ్వబడుతుంది. నాలుగ మూలస్థంభము: “హజ్జ్”. అల్లాహ్ యొక్క ఆరాధనలో భాగంగా మక్కా నగరంలోని కాబా గృహాన్ని దర్శించి అక్కడ దానికి సంబంధించిన విధి,విధానాలను ఆచరించడాన్ని “హజ్జ్” అంటారు. ఐదవ మూల స్థంభము: రమదాన్ నెల ఉపవాసములు పాటించుట: ఉపవాసము అంటే – అల్లాహ్’ను ఆరాధించే సంకల్పముతో, ఉషోదయం నుండి మొదలుకుని సూర్యాస్తమయం వరకు తినుట, త్రాగుట మరియు ఉపవాసాన్ని భంగపరిచే ప్రతి విషయాన్నుండి దూరంగా ఉండుట.
అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: "రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా పలికినారు, మరియు ఆయన ఎల్లప్పుడూ సత్యమే పలికిన సత్యవంతుడు: "నిశ్చయంగా, మీలో ఒకరి సృష్టి అతని తల్లి కడుపులో నలభై రోజులు నీటి బిందువు (స్పెర్మ్)గా సేకరించబడుతుంది, ఆ తర్వాత అదే విధంగా నలభై రోజులు ఒక గడ్డ కట్టిన రక్తం ముద్దగా (అలఖగా) మారుతుంది, ఆ తర్వాత అదే విధంగా నలభై రోజులు ఒక మాంసపు ముద్దగా (ముద్’గహ్) మారుతుంది. అప్పుడు ఒక దైవదూతను దాని వైపు పంపబడతాడు, ఆ దైవదూత దానిలో ఆత్మను ఊదుతాడు. మరియు నాలుగు విషయాలను వ్రాయమని ఆజ్ఞాపించబడతాడు: దాని జీవనాధారం (పోషణ, రిజ్’ఖ్), దాని ఆయుష్షు (అజల్), దాని ఆచరణలు (అమల్), మరియు అది దురదృష్టమైనదా లేదా అదృష్టమైనదా అని." అల్లాహ్ పై ప్రమాణం! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు! నిశ్చయంగా, మీలో ఒకరు స్వర్గవాసుల పనులు చేస్తూ ఉంటారు, చివరికి స్వర్గానికి అతనికి మధ్య కేవలం ఒక మూర దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు అతని కోసం వ్రాయబడినది అతనిపై ఆధిక్యత సాధించడం వలన, అతడు నరకవాసుల పనులు చేస్తాడు మరియు అందులో (నరకంలో) ప్రవేశిస్తాడు. మరియు నిశ్చయంగా, మీలో ఒకరు నరకవాసుల పనులు చేస్తూ ఉంటారు, చివరికి నరకానికి అతనికి మధ్య కేవలం ఒక మూర దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు అతని కోసం వ్రాయబడినది అతడిపై ఆధిక్యత సాధించడం వలన, అతడు స్వర్గవాసుల పనులు చేస్తాడు మరియు అందులో (స్వర్గంలో) ప్రవేశిస్తాడు.""
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హుమా ఇలా అంటున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఒక విషయం తెలియ జేసారు. ఆయన సత్యసంధుడూ, అత్యంత విశ్వసనీయుడూ, అలా అని అల్లాహ్ కూడా ధృవపరిచినాడు. ఆయన ఇలా అన్నారు: మీలో ప్రతి ఒక్కరి సృష్టి (దానికి కావలసిన విషయాల) సమీకరణ ద్వారా జరుగుతుంది. మనిషి తన భార్యతో సంభోగించినపుడు ఆమె గర్భములో చిందిన అతడి వీర్యము నుండి ఒక ‘నుత్ఫహ్’ (వీర్యములో ఫలవంతమైన చిన్న భాగము) నలభై దినములలో సమీకరించబడుతుంది. తరువాత అది ఒక జలగ మాదిరి గోచరించే, మరియు స్తబ్దముగా ఉన్న మందమైన రక్తపు ముద్దగా మారుతుంది. ఇది రెండవ నలభై దినముల కాలములో జరుగుతుంది. తరువాత అది మందముగా, దొడ్డుగా ఉండే, మరియు నమల బడిన ఒక మాంసపు ముద్దగా అవుతుంది. ఇది మూడవ నలభై దినముల కాలములో జరుగుతుంది. తరువాత, చివరి నలభై దినములలో చివరి భాగము ముగిసిన తరువాత అతని లోనికి ఆత్మను ఊదడానికి అల్లాహ్ ఒక దైవదూతను పంపుతాడు. ప్రభువైన అల్లాహ్ అతనికి సంబంధించి నాలుగు ఆజ్ఞలు రాయమని ఆ దైవదూతను ఆదేశిస్తాడు: అతని జీవనోపాధిని గురించి – అతడి జీవిత కాలములో అల్లాహ్ అనుగ్రహాల నుండి ఏ అనుగ్రహాలను ఎంత మొత్తములో పొందుతాడు అనే వాటి గురించి; అతడి జీవితకాలమును గురించి – ఈ ప్రపంచములో అతడు ఎంతకాలము నివసిస్తాడు అనే విషయము. అతడి ఆచరణలను గురించి – అతడు ఎలాంటి వాడు? అవినీతిపరుడా, చెడ్డవాడా; లేక ధన్య జీవా (పుణ్యాత్ముడా) అనే విషయం. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒట్టు పెట్టుకుని మరీ ఇలా అన్నారు – నిశ్చయంగా ఒక మనిషి స్వర్గవాసుల ఆచరణలను చేస్తూ ఉంటాడు. అతడు చేసేవన్నీ మంచిపనులు, సత్కార్యాలు అయి ఉంటాయి. ప్రజలకు అలాగే కనపడుతాడు. ఆ విధంగా అతడు ఎంత వరకూ అలా ఉంటాడూ అంటే, భూమి నుండి అతనికీ స్వర్గానికీ మధ్య కేవలం ఒక మూర అంత దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు (విధివ్రాత) గ్రంథములో అతని కొరకు రాయబడిన ‘ఖద్ర్’ అతడిని అధిగమిస్తుంది. అతడు నరకవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు. అదే అతని ముగింపు అవుతుంది, మరియు అతడు నరకం లోనికి ప్రవేశిస్తాడు. ఎందుకంటే, అతని సదాచరణలు స్వీకరించబడడానికి నియమం ఏమిటంటే అతడు వాటిపై స్థిరంగా ఉండాలి, వాటి నుండి ఇతర ఆచరణలకు మరల రాదు. మరో వైపు, జనులలో నుండి ఒకడు నరకవాసుల ఆచరణలను చేస్తూ ఉంటాడు. ఎంతవరకూ అంటే, ఇక అతడు నరకం లోనికి ప్రవేశిస్తాడు, భూమిపైనుండి అతనికీ నరకానికీ మధ్య కేవలం ఒక మూర దూరం మాత్రమే మిగిలి ఉంటుది. అపుడు (విధివ్రాత) గ్రంథములో అతని కొరకు రాయబడిన ‘ఖద్ర్’ అతడిని అధిగమిస్తుంది. అతడు స్వర్గవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు అతడు స్వర్గము లోనికి ప్రవేశిస్తాడు.