





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైనా మన ఈ ధర్మంలో (ఇస్లాం) భాగం కాని ఏదైనా కొత్త విషయాన్ని ప్రవేశపెడితే, అది తిరస్కరించబడుతుంది." ముస్లింలో నమోదు చేయబడిన హదీథులో ఇలా ఉన్నది: "మా ఆజ్ఞకు అనుగుణంగా లేని పనిని ఎవరు చేసినా, అది తిరస్కరించబడుతుంది."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: ఎవరైనా ఈ ధర్మములో (ఇస్లాంలో) ఏదైనా కొత్త విషయాన్ని సృష్టించినట్లయితే, లేదా ఖుర్’ఆన్ మరియు సున్నత్’లలో ప్రామాణికము లేని ఏదైనా ఆచరణను ఆచరించినా, అది ఈ ధర్మము యొక్క యజమాని (అల్లాహ్) చే తిరస్కరించబడుతుంది, మరియు ఆయన వద్ద (అల్లాహ్ వద్ద) అది ఆమోదయోగ్యము కాదు.
అబూ హురైరహ్ అబ్దుర్రహ్మాన్ బిన్ సఖ్'ర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: నేను మీకు వారించిన వాటి నుండి మీరు దూరంగా ఉండండి; నేను మీకు ఆజ్ఞాపించిన దానిని మీకు సాధ్యమైనంత వరకు చేయండి. నిజంగా, మీకంటే పూర్వం గతించిన వారిని నాశనం చేసినది వారి అధిక ప్రశ్నలు అడగడము, తమ ప్రవక్తలకు విరోధంగా వ్యవహరించడమ.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా స్పష్టం చేసినారు: ఆయన దేని నుంచైనా మనల్ని వారించినప్పుడు, మనం దాని నుండి ఎలాంటి మినహాయింపు లేకుండా పూర్తిగా దూరంగా ఉండ వలెను. మరియు ఆయన దేనినైనా మనకు ఆజ్ఞాపించినప్పుడు, మనం మన శక్తి మేరకు దానిని పూర్తి చేయ వలెను. అనంతరం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్వం గతించిన కొన్ని సమాజముల వలె ప్రవర్తించవద్దని మనల్ని హెచ్చరించారు. వారు తమ ప్రవక్తలను మరీ ఎక్కువ ప్రశ్నలు అడిగేవారు మరియు ధిక్కరించేవారు. దాని ఫలితంగా, అల్లాహ్ వారిని వివిధ రకాల వినాశనాలతో మరియు విధ్వంసాలతో శిక్షించాడు. కాబట్టి, వారు నాశనమైనట్లుగా మనం కూడా నాశనం కాకుండా ఉండటానికి మనం వారిలా ప్రవర్తించకూడదు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "నిశ్చయంగా, అల్లాహ్ పరమ పరిశుద్ధుడు, మరియు పరిశుద్ధమైన దానిని తప్ప మరేమీ అంగీకరించడు. మరియు అల్లాహ్ విశ్వాసులకు, ప్రవక్తలకు ఆజ్ఞాపించిన దానినే మీకూ ఆజ్ఞాపించాడు."; అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {ఓ ప్రవక్తలారా! పరిశుద్ధమైన వాటిని భుజించండి మరియు మంచి పనులు చేయండి.} (అల్-ముమినూన్: 51); మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వాటి నుండే భుజించండి.} (అల్-బఖరహ్: 172); ఆ తర్వాత ప్రవక్త ఒక వ్యక్తి గురించి ప్రస్తావించారు: అతను సుదీర్ఘ ప్రయాణం చేయడం వలన అతని వెంట్రుకలు చిందరవందరగా, దుమ్ము పట్టి ఉన్నాయి. అతను తన చేతులను ఆకాశం వైపు చాచి: 'ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!' అని వేడుకుంటున్నాడు. అయితే, అతని ఆహారం నిషేధించబడినది (హరామ్), అతని పానీయం నిషేధించబడినది, అతని దుస్తులు నిషేధించబడినవి, మరియు అతను నిషేధించబడిన వాటితోనే పోషించబడ్డాడు. అలాంటి వ్యక్తి దుఆ (ప్రార్థన) ఎలా స్వీకరించబడుతుంది?"
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు, మరియు పరమ పవిత్రుడు, కొరతలు, లోపాలు మరియు దోషాలు లేనివాడు మరియు పరిపూర్ణతలతో కూడిన సంపూర్ణ గుణగణాలు, లక్షణాలు కలిగిన వాడు. ఆయన మంచిని మరియు పరిశుద్ధమైన వాటిని, మరియు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఆచరించిన వాటిని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గదర్శకానికి అనుగుణంగా ఉన్న వాటిని తప్ప మరి దేనినీ అంగీకరించడు – అవి ఆచరణలైనా, పలుకులైనా లేదా నమ్మకాలైనా. వీటి ద్వారా తప్ప ఎవరూ అల్లాహ్ సామీప్యానికి చేరుకోవాలని కోరుకోరాదు. విశ్వాసి తన ఆచరణలను ఉత్తమమైనవిగా మార్చుకోవడానికి ఉన్న మార్గాలలో ఉత్తమమైనది ఏమిటంటే అతడు తినే ఆహారం పరిశుద్ధమైనదై ఉండడం, అంటే హలాల్ సంపాదన ద్వారా సంపాదించినది మాత్రమే తినడం. అది అతడి ఆచరణలను పరిశుద్ధ పరుస్తుంది. ఆ విధంగా అతడి ఆచరణలు పరిశుద్ధమవుతాయి. కనుక, అల్లాహ్ తాను ప్రవక్తలకు, సందేశహరులకు ఏదైతే ఆదేశించినాడో, దానినే విశ్వాసుల కొరకు కూడా ఆదేశించినాడు: ధర్మసమ్మతమైన దానిని (హలాల్) మాత్రమే తినండి మరియు మంచి పనులు చేయండి’ అని. అల్లాహ్ ప్రకటన, { يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ } [ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వాటినే తినండి మరియు సత్కార్యాలు చేయండి. 17 నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు. సూరహ్ అల్ ము’మినూన్ 23:51]; మరియు అల్లాహ్ ప్రకటన: { يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ} [ఓ విశ్వాసులారా! మీరు నిజంగానే కేవలం ఆయన (అల్లాహ్)నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ఇచ్చిన పరిశుద్ధ (ధర్మసమ్మత)మైన వాటినే తినండి, సూరహ్ అల్ బఖరహ్ 2:172] ఇంకా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హరాం (ధర్మ విరుద్ధమైనది) తినరాదని హెచ్చరించినారు. అది ఆచరణలను నాశనం చేస్తుంది. అది ఆచరణలు (అల్లాహ్ వద్ద) స్వీకరించబడడాన్ని నిరోధిస్తుంది; ఆ బాటసారి ఆమోదయోగ్యమైన స్పష్టమైన మార్గాలను ఉపయోగించినప్పటికీ అతని ఆచరణలు ఆమోదయోగ్యం కావు: ఉదాహరణకు: మొదటిది: (అల్లాహ్’కు) విధేయతను చూపే వాటిని ఆచరించుటకు అతడు ఎంత దూరం ప్రయాణించినా, అంటే హజ్ చేయడం, జిహాద్ లో పాల్గొనడం, అలాగే బంధుత్వాలను గౌరవించడం, వాటిని నిభాయించడం మొదలైనవి చేసినా, చేస్తూ ఉన్నా. రెండవది: తల వెంట్రుకలను దువ్వుకోకపోవడం వల్ల చిందరవందరగా ఉన్న వెంట్రుకలు, దుమ్ము కారణంగా రంగు మారిన చర్మం మరియు అతని ఒంటిపై బట్టలు కూడా రంగు మారి, అతను నిస్సహాయంగా దీనస్థితిలో ఉన్నాడు. మూడవది: అతడు తన రెండు చేతులను ఆకాశం వైపునకు ఎత్తి దుఆ చేయడం. నాల్గవది: అల్లాహ్’ను ఆయన పేర్ల ద్వారా పట్టుదలతో వేడుకొనడం: “ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!” అంటూ. ఈ విధంగా ప్రార్థనలకు జవాబు లభించటానికి ఆవశ్యకమైన అన్ని మార్గాలు ఉన్నప్పటికీ, అతడికి ఏ సమాధానమూ లభించ లేదు; ఎందుకంటే అతని ఆహారం, పానీయం మరియు బట్టలు హరాం (అక్రమమైనవి), మరియు అతడు హరాం (ధర్మ విరుద్ధమైన, అక్రమమైన వాటి) ద్వారా పోషించబడ్డాడు. ఈ హదీథులో వర్ణించబడినటువంటి వ్యక్తి విన్నపానికి, అతని వేడుకోలుకు సమాధానం లభించడం దాదాపుగా అసంభవం; దానికి ఎలా సమాధానం లభిస్తుంది?
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ఒకరోజు నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక ఉన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "ఓ బాలుడా! నేను నీకు కొన్ని విషయాలు బోధిస్తాను: అల్లాహ్ ను (ఆదేశాలను పాటించడం, ఆయన హక్కులను గౌరవించడం) సంరక్షించు, ఆయన నిన్ను సంరక్షిస్తాడు. అల్లాహ్ ను (ఆదేశాలను) సంరక్షించు, ఆయన నీతో పాటే ఉన్నట్లు నీవు కనుగొంటావు. నీవు ఏదైనా అడగాలనుకుంటే, తిన్నగా అల్లాహ్ నే అడుగు. నీవు సహాయం కోరాలనుకుంటే, తిన్నగా అల్లాహ్ ను మాత్రమే సహాయం కోరు. మరియు తెలుసుకో! ఈ జాతి మొత్తం నీకు ఏదైనా మేలు చేయాలని ఏకమైనా, అల్లాహ్ నీకు వ్రాసి పెట్టిన మేలును తప్ప వారు నీకు ఏ మేలూ చేయలేరు. మరియు వారు నీకు ఏదైనా కీడు చేయాలని ఏకమైనా, అల్లాహ్ నీకు వ్రాసి పెట్టిన కీడును తప్ప వారు నీకు ఏ కీడు చేయలేరు. కలములు ఎత్తబడ్డాయి మరియు వ్రాతలు ఆరిపోయాయి." తిర్మిథిలోని హదీథులో కాకుండా మరొక ఉల్లేఖనలో ఇలా ఉంది: "అల్లాహ్ ను సంరక్షించు, ఆయనను నీవు నీ ఎదుట కనుగొంటావు. సుఖసమయాలలో నీవు అల్లాహ్ ను తెలుసుకో, ఆయన నిన్ను కష్టసమయాలలో గుర్తిస్తాడు. మరియు తెలుసుకో, ఏది నిన్ను చేరకుండా ఉండిపోయిందో అది నిన్ను చేరుకునేది కాదు, మరియు ఏది నిన్ను చేరుకుందో అది నిన్ను తప్పించుకునేది కాదు. మరియు తెలుసుకో, విజయం సహనంతోనే ఉంటుంది, కష్టం తరువాత ఉపశమనం ఉంటుంది, మరియు కష్టం తరువాత సులభం, సుఖం ఉంటుంది."
అత్తిర్మిదీ మరియు తదితరులు నమోదు చేసినారు:ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా తెలియజేశారు: నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో కలిసి ఒక వాహనంపై ఉన్నాను. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు: "నేను నీకు కొన్ని విషయాలను, కొన్ని అంశాలను బోధిస్తాను, వాటి ద్వారా అల్లాహ్ నీకు ప్రయోజనం చేకూరుస్తాడు." అల్లాహ్ యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా మరియు ఆయన నిషేధాల నుండి దూరంగా ఉండడం ద్వారా అల్లాహ్ ను సంరక్షించు. తద్వారా ఆయన నిన్ను విధేయతలలో మరియు సాన్నిధ్యంలో కనుగొంటాడు, కానీ పాపాలలో మరియు అపరాధాలలో కనుగొనడు. నీవు అలా చేస్తే, దాని ప్రతిఫలంగా అల్లాహ్ నిన్ను ఈ లోకంలోని మరియు పరలోకంలోని కష్టాల నుండి సంరక్షిస్తాడు మరియు నీవు ఎక్కడ వెళ్ళినా నీ ముఖ్యమైన పనులలో నీకు సహాయం చేస్తాడు. "మరియు నీవు ఏదైనా అడగాలని కోరితే, అల్లాహ్ ను మాత్రమే అడుగు. ఎందుకంటే కేవలం ఆయన మాత్రమే అడిగేవారికి సమాధానం ఇచ్చేవాడు." "మరియు నీవు ఎవరి సహాయాన్ని అయినా కోరాలనుకుంటే, కేవలం అల్లాహ్ ను మాత్రమే (సహాయం) కోరు." "మీకు ఒక ప్రయోజనం చేకూర్చాలని భూమిపై ఉన్న వారందరూ ఏకమైనా సరే, అల్లాహ్ దానిని మీకు వ్రాసి పెట్టి ఉంటే తప్ప మీ కొరకు ఏమీ చేయలేరు; మరియు మీకు ఒక హాని చేయాలని భూమిపై ఉన్న వారందరూ ఏకమైనా సరే, అల్లాహ్ దానిని మీపై నిర్ణయించి ఉంటే తప్ప, మీకు ఎలాంటి హానీ కలిగించలేరు" అని మీరు నిశ్చయంగా విశ్వసించాలి. "మరియు ఈ విషయం అల్లాహ్ చేత, ఆయన జ్ఞానం మరియు వివేచనకు అనుగుణంగా వ్రాయబడింది మరియు నిర్ణయించబడింది. అల్లాహ్ వ్రాసిన దానిని మార్చడం ముమ్మాటికీ అసాధ్యం." అల్లాహ్ యొక్క ఆజ్ఞలను పాటించడం మరియు ఆయన నిషేధాల నుండి దూరంగా ఉండటం ద్వారా ఎవరైతే అల్లాహ్ ను సంరక్షిస్తారో, నిశ్చయంగా అల్లాహ్ తన దాసుడికి ఎదురుగా ఉండి, అతనికి ఏమి జరుగుతుందో తెలుసుకుంటాడు, అతనికి సహాయం చేసి మద్దతు ఇస్తాడు. ఒక వ్యక్తి సుఖసమయాలలో అల్లాహ్ కు విధేయత చూపితే, అల్లాహ్ కష్టసమయాలలో అతనికి ఉపశమనాన్ని, ఒక మార్గాన్ని కల్పిస్తాడు. ప్రతి దాసుడు అల్లాహ్ తనకు నిర్ణయించిన మంచి మరియు చెడు పట్ల సంతృప్తి చెందాలి. కష్టాలు మరియు పరీక్షలు వచ్చినప్పుడు, దాసుడు సహనంతో ఉండాలి, ఎందుకంటే సహనం ఉపశమనానికి తాళం చెవి. కష్టం తీవ్రమైనప్పుడు, అల్లాహ్ నుండి ఉపశమనం వస్తుంది. మరియు కష్టం వచ్చినప్పుడు, అల్లాహ్ దాని తర్వాత సుఖాన్ని కలుగజేస్తాడు.
అబూ 'అమ్ర్ - లేదా అబూ 'అమ్రహ్ - సుఫ్యాన్ ఇబ్నె అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్, నేను మిమ్మల్ని తప్ప మరింకెవరినీ ప్రశ్నించ వలసిన అవసరం లేని విధంగా – నాకు ఇస్లాం ను గురించి బోధించండి.” దానికి ఆయన ఇలా అన్నారు: “నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని (మనస్పూర్తిగా) పలుకు; మరియు దానిపై స్థిరంగా ఉండు.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలలో ఒకరైన సుఫ్యాన్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు. “ఇస్లాం యొక్క అర్థం పూర్తిగా, సమగ్రంగా పొందుపరిచి ఉండేలా; తద్వారా తాను దానికి విశ్వాసపాత్రునిగా ఉండేలా, మరియు దాని గురించి ఇంకెవరినీ ప్రశ్నించే అవసరం లేని విధంగా, ఒక వాక్యాన్ని తనకు బోధించమని” ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో (మనస్ఫూర్తిగా) ఇలా పలుకు అన్నారు: “నేను అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని స్థిరపరుస్తున్నాను, ఆయనను విశ్వసిస్తున్నాను, ఆయనే నా ప్రభువు, మరియు ఆయనే ఏకైక ఆరాధ్యుడు, ఆయనే నా సృష్టికర్త, మరియు ఆయనే నేను సత్యపూర్వకంగా ఆరాధించేవాడు, ఆయనకు సాటి, సమానులు ఎవరూ లేరు”. “తరువాత అల్లాహ్ అనుమతించిన మరియు ఆదేశించిన వాటిని ఆచరిస్తూ, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉంటూ ఆయనకు విధేయునిగా ఉండు, ఆ విధేయతపై స్థిరంగా ఉండు.”
అబూ అబ్దుల్లాహ్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ అల్ అన్సారీ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగినాడు: "మీరు ఏమంటారు? నేను తప్పనిసరి ఫర్ద్ నమాజులను చేస్తూ, రమజాన్ మాసంలో ఉపవాసం ఉంటూ, ధర్మబద్ధమైన దానిని ధర్మబద్ధంగా భావిస్తూ, మరియు నిషేధించబడిన దానిని నిషేధించబడినదిగా భావిస్తూ, నేను దానిపై ఏమీ అధికంగా చేయకుండా ఉంటే, నేను స్వర్గంలో ప్రవేశిస్తానా?" ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: "అవును."
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైనా కేవలం విధిగా ఆచరించవలసిన ఐదు పూటల నమాజులను మాత్రమే ఆచరిస్తాడో, వేరే స్వచ్ఛంద నమాజులు ఎక్కువగా ఆచరించడో, అలాగే విధిగా ఆచరించవలసిన రమదాన్ నెల ఉపవాసములను మాత్రమే ఆచరిస్తూ, ఇతర స్వచ్ఛంద ఉపవాసములను ఆచరించడో, హలాల్ విషయాలను హలాల్ విషయాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, వాటిని ఆచరిస్తూ, హరాం విషయాలను హరాం విషయాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, వాటికి దూరంగా ఉంటాడో, అతడు స్వర్గము లోని ప్రవేశిస్తాడు.
ముఅద్ ఇబ్నె జబల్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, అతను ఇలా అన్నారు: "నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగాను: 'ఓ రసూలుల్లాహ్ ! నన్ను స్వర్గంలోకి ప్రవేశపెట్టి, నరకం నుండి దూరం చేసే ఒక పని గురించి నాకు తెలియజేయండి.' అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నిశ్చయంగా, నీవు ఒక గొప్ప విషయం గురించి అడిగావు. అయితే, అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో వారికి అది నిజంగా సులభం: అల్లాహ్ ను తప్ప మరెవరినీ ఆరాధించకు, ఆయనతో మరెవ్వరినీ భాగస్వామిగా చేయకు, నమాజ్ స్థాపించు, జకాత్ ఇవ్వు, రమదాను మాసంలో ఉపవాసం పాటించు మరియు అల్లాహ్ యొక్క గృహానికి (కఅ'బా) హజ్ చేయి." తరువాత ఆయన ఇలా అన్నారు: "శుభాల (ఖైర్) యొక్క ద్వారాలను నీకు చూపించనా? ఉపవాసం ఒక కవచం, సదఖా (దానధర్మం) నీరు నిప్పును ఆర్పినట్లు పాపాన్ని ఆర్పివేస్తుంది, మరియు రాత్రి మధ్యభాగంలో ఒక వ్యక్తి చేసే (తహజ్జుద్, ఖియాముల్’లైల్) నమాజ్..." ఆ తర్వాత ఆయన ఈ ఆయత్ ను చదివారు: "{వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరం చేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడుకుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేస్తారు. కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు} (ఖుర్ఆన్ 32:16-17) అనే వాచనం వరకు." ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు: "ఈ విషయం యొక్క శిరస్సు, దాని మూలస్తంభం మరియు దాని శిఖరం గురించి నేను నీకు తెలియజేయనా?" దానికి నేను "అవును, ఓ రసూలుల్లాహ్!" అన్నాను. అపుడు ఆయన ఇలా అన్నారు: "ఈ విషయం యొక్క శిఖరం 'ఇస్లాం', దాని మూలస్తంభం 'నమాజ్', మరియు దాని శిఖరం 'జిహాద్' (అల్లాహ్ మార్గంలో సత్యం, న్యాయం కొరకు చేసే ధర్మపోరాటం)." తరువాత ఆయన ఇలా అన్నారు: "ఈ మొత్తం విషయానికి మూలాధారమైన దాని గురించి నేను నీకు తెలియజేయనా?" నేను "అవును, ఓ రసూలుల్లాహ్!" అన్నాను. అప్పుడు ఆయన తన నాలుకను పట్టుకుని ఇలా అన్నారు: "దీనిని నీ ఆధీనంలో ఉంచుకో (నియంత్రించుకో)." దానికి నేను అన్నాను: "ఓ రసూలుల్లాహ్! మేము మాట్లాడే వాటికి కూడా మాపై శిక్ష విధింపబడుతుందా?" అప్పుడు ఆయన ఇలా అన్నారు: "నీ తల్లి నిన్ను కోల్పోవుగాక! ప్రజలను వారి ముఖాలపై లేదా వారి ముక్కులపై నరకంలో పడేసేది వారి నాలుకల పంట (మాటల ఫలితం) తప్ప మరొకటి ఉందా?"
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ముఆద్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఒక ప్రయాణంలో ఉన్నాను, మరియు ఒక రోజు మేము నడుచుకుంటూ వెళుతున్నప్పుడు నేను ఆయనకు దగ్గరగా ఉన్నాను, అపుడు నేను ఇలా అడిగాను: "ఓ రసూలల్లాహ్! నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేసే మరియు నన్ను నరకం నుండి దూరంగా ఉంచే ఆచరణ గురించి చెప్పండి." ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: "వాస్తవానికి నీవు ప్రజలు నిర్వహించడం కష్టతరమైన ఒక కార్యం గురించి అడిగావు, అయితే అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో అది వారికి చాలా సులభం మరియు తేలిక - ఇస్లాం విధిగా ఆచరించమని ఆదేశించిన వాటిని ఆచరించు." మొదటిది: ఎవరినీ, దేనినీ ఆయనకు సాటిగా, సహవర్తిగా, భాగస్వామిగా నిలబట్టకుండా కేవలం అల్లాహ్’ను మాత్రమే ఆరాధించు. రెండవది: రాత్రంబవళ్ళలో విధిగా ఆచరించవలసిన ఐదు నమాజులు ఆచరించు – ఫజ్ర్, దొహ్ర్, అస్ర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు; వాటి నిర్ధారిత సమయాలలో, వాటికి సంబంధించిన అన్ని నియమాలను, సంప్రదాయాలను పాటిస్తూ ఆచరించు. మూడవది: విధి చేయబడిన జకాతును చెల్లించు. ఇది ఒక ఆర్ధిక పరమైన ఆరాధన. ఇది నిర్ణీత స్థాయికి చేరిన కొన్ని సంపదలపై షరియత్ విధి చేసిన మొత్తము. ఇది అర్హులైన వారికి ఇవ్వబడుతుంది. నాలుగవది: రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట. ఉపవాసము అంటే ఉషోదయం నుండి మొదలుకుని, సూర్యాస్తమయం వరకు, ఆరాధనా సంకల్పముతో తినుట, త్రాగుట మరియు ఉపవాసమును భంగపరిచే ప్రతి విషయము నుండి దూరంగా ఉండుట. ఐదవది: హజ్ యొక్క నియమాలను పాటిస్తూ, కేవలం సర్వోన్నతుడైన అల్లహ్’ను ఆరాధించే సంకల్పముతో, మక్కాహ్ నగరాన్ని దర్శించి బైతుల్లాహ్ యొక్క (అల్లాహ్ యొక్క గృహము) హజ్ చేయుట. అప్పుడు ఆయన (స) ఇలా అన్నారు: “నేను నీకు శుభాల ద్వారాలకు దారి తీసే మార్గం గురించి తెలియజేయనా? విధిగా ఆచరించ వలసిన విషయాలతో పాటు స్వచ్ఛంద ఆరాధనలను (సున్నతు, నఫిల్) నిర్వర్తించు”. మొదటిది: స్వచ్ఛంద ఉపవాసములు పాటించుట, ఇది వాంఛలను, కోరికలను అణచివేసి, వ్యక్తిలో శక్తిని తక్కువ చేస్తుంది, తద్వారా పాపకార్యములలో పడిపోకుండా నిరోధిస్తుంది. రెండవది: (విధిగా చెల్లించే జకాతు కాక) స్వచ్ఛందంగా దానములు చేయుట, ఒకవేళ మన వల్ల ఏదైనా తప్పుడు పని, పాపపు పని జరిగిపోయినట్లైతే, ఈ స్వచ్చంద దానములు దానిని తుడిచివేస్తాయి. మూడవది: రాత్రి చివరి భాగములో ఆచరించే తహజ్జుద్ సలాహ్. తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కులను పఠించినారు: {تتجافى جنوبهم } అంటే “వారు తమ ప్రక్కలను (కుడి, ఎడమ ప్రక్కలను) దూరం చేసుకుంటారు”; {عن المضاجع} “తమ మెత్తని పరుపులనుండి”; {يدعون ربهم} “తమ ప్రభువును వేడుకుంటారు” సలాహ్ ద్వారా, ఆయనను స్మరించుట ద్వారా; ఖుర్’ఆన్ పఠనం ద్వారా, మరియు దుఆ చేయుట ద్వారా; {خَوْفًا وَطَمَعًا وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ فَلَا تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ} “భయంతో మరియు ఆశతో వేడుకుంటారు; మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చుచేస్తారు; కాని వారికి, వారికర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచిపెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు”; అంటే, తీర్పు దినాన మరియు స్వర్గంలో వారికి అంతిమ సౌఖ్యాన్ని అందించే ఆనందం {جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ ١٧} (వారు ఆచరిస్తూ ఉండిన దానికి ప్రతిఫలంగా). (వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరం చేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడుకుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చుచేస్తారు. కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు). అప్పుడు ఆయన (స) ఇలా అన్నారు: నేను నీకు ధర్మం యొక్క (దీన్ యొక్క) పునాది ఏమిటో తెలుపనా? దాని ఆధారభూతమైన మూల స్తంభము గురించి తెలుపనా? మరియు దాని శిఖరం గురించి తెలుపనా? ము’ఆద్ (రదియల్లాహు అన్హు) “తప్పకుండా తెలుపండి ఓ రసూలల్లాహ్” అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ఈ మొత్తం విషయం యొక్క శిరస్సు అల్’ఇస్లాం. ఇస్లాం అంటే రెండు విషయాలపట్ల సాక్ష్యం ఇవ్వడం (షహాదతాన్ – రెండు సాక్ష్యాలు). విశ్వాసానికి సంబంధించిన ఈ రెండు సాక్ష్యాల ద్వారా ధర్మం యొక్క సారాంశాన్ని పొందుతారు. మరియు దాని స్తంభం సలాహ్, కనుక సలాహ్ లేకుండా ఇస్లాం లేదు, ఒక ఇల్లు స్తంభం లేకుండా లేనట్లే, ఎవరైనా సలాహ్ చేస్తే, అతని ఇస్లాం (ధర్మం) మరింత బలపడుతుంది మరియు ఉన్నతమవుతుంది; దాని శిఖరం మరియు ఔన్నత్యం జిహాద్లో ఉంది మరియు అల్లాహ్ వాక్కును అత్యున్నతం చేయుటకుగానూ ఇస్లాం యొక్క శత్రువులతో పోరాడడంలో, కృషి చేయడంలో ఉంది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: పైన పేర్కొన్న వాటిని ఏది నియంత్రిస్తుందో మరియు ఏది పరిపూర్ణం చేస్తుందో నేను నీకు చెప్పనా? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన నాలుకను పట్టుకుని ఇలా అన్నారు: దీన్ని నియంత్రించుకో మరియు మీకు సంబంధం లేని వాటి గురించి మాట్లాడకు. అపుడు ముఆద్ ఇలా అన్నాడు: మనం మాట్లాడే దానికి మన ప్రభువు మనల్ని జవాబుదారీగా మరియు బాధ్యులుగా చేసి శిక్షిస్తాడా?! అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నీ తల్లి నిన్ను పోగొట్టుకోను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన మాటను మొదలుపెట్టారు. ఇలా అనడం వాస్తవానికి శాపనార్థం కాదు. ఇది అరబీ భాషలో ఒక విధమైన వాడుక – “ఇంత చిన్న విషయం కూడా నీకు తెలియదా, నీవు దీనిని గురించి ఎప్పుడో తెలుసుకుని ఉండవలసింది” అని ఆ విషయం పట్ల అతణ్ణి హెచ్చరించడం; ఉదాహరణకు తెలుగు భాషలో “నీ మొహం మండా” అనడం లాంటిది, ఇలా అనడం తెలుగు భాషలో అతని ముఖం నిజంగానే మండాలని పెట్టే శాపనార్థం కాదు అన్న విషయం మనందరికీ తెలుసు. తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “మనుషుల నాలుకలు పండించే పంటలు - అవిశ్వాసం, అపనిందలు, తిట్లు, దూషణలు, చాడీలు మాట్లాడుట - ఇవి తప్ప మనుషులను మంటల్లోకి నెట్టివేసి వారి ముఖాలపై పడేలా చేసేది మరేదైనా ఉందా?”.
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు నుండి ఇలా పలికినారు, ఆయన (అల్లాహ్) పలుకులు (హదీథు ఖుద్సీ): "నిశ్చయంగా, అల్లాహ్ మంచి పనులను మరియు చెడు పనులను లిఖించినాడు, ఆ తర్వాత దానిని వివరించాడు. ఎవరైతే ఒక మంచి పని చేయాలని సంకల్పించుకుని, దానిని చేయలేదో, అల్లాహ్ దానిని తన వద్ద ఒక సంపూర్ణ మంచి పనిగా వ్రాస్తాడు. ఒకవేళ ఒక మంచి పని చేయాలని సంకల్పించుకుని, దానిని ఆచరించినట్లయితే, అల్లాహ్ దానిని తన వద్ద పది నుండి ఏడు వందల రెట్లుగా, లేదా ఇంకా అనేక రెట్లు అధికంగా వ్రాస్తాడు. ఎవరైతే ఒక చెడు పని చేయాలని సంకల్పించుకుని, దానిని చేయలేదో, అల్లాహ్ దానిని తన వద్ద ఒక సంపూర్ణ మంచి పనిగా వ్రాస్తాడు. ఒకవేళ ఒక చెడుపని చేయాలని సంకల్పించుకుని, దానిని ఆచరించినట్లయితే, అల్లాహ్ దానిని ఒకే ఒక చెడు పనిగా వ్రాస్తాడు."
అల్ బుఖారీ మరియు ముస్లిం తమ సహీహైన్ లలో ఇదే పదాలతో నమోదు చేసినారు:ఈ హదీసులో – మంచి చెడుల ప్రతిఫలాన్ని అల్లాహ్ ముందుగానే నిర్ణయించినాడని, వాటిని ఏవిధంగా గ్రంథస్థం చేయాలనే విషయాన్ని, (ప్రతి వ్యక్తితో పాటు ఎల్లప్పుడూ ఉండే) ఇద్దరు దైవ దూతలకు విశదీకరించినాడని – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. కనుక ఎవరైతే, ఏదైనా మంచి పని చేయాలని ఆలోచన చేసి, సంకల్పము చేసి మరియు దానిని చేయుట కొరకు కృతనిశ్చయుడు అయినట్లయితే, ఒకవేళ అతడు దానిని చేయలేకపోయినా అతడి కొరకు ఒక మంచి పని చేసినట్లు వ్రాయబడుతుంది. ఒకవేళ అతడు దానిని చేసినట్లయితే, పది రెట్ల నుండి ఏడు వందల రెట్ల వరకు, ఇంకా ఎక్కువ రెట్లు మంచి పనులు చేసినట్లుగా వ్రాయబడుతుంది. అయితే, పుణ్యఫలం ఎక్కువరెట్లు వ్రాయబడుట మరియు దానికి మించిన ప్రయోజనము అనేది అతడి హృదయంలో ఉన్న సంకల్పము యొక్క స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. మరియు ఎవరైతే, ఏదైనా చెడు పని చేయాలని ఆలోచన చేసి, సంకల్పము చేసి మరియు దానిని చేయుట కొరకు కృతనిశ్చయుడు అయినట్లయితే, మరియు అతడు దానిని కేవలం అల్లాహ్ కొరకు చేయకుండా ఆగిపోయినట్లయితే, అతడి కొరకు ఒక మంచి పని చేసినట్లు వ్రాయబడుతుంది. మరియు దానిని చేయుట కొరకు కృతనిశ్చయుడై ఉండి, అతడు దాని కొరకు అవసరమైన వనరులు సమకూర్చుకొనకుండా ఉండిపోయినట్లయితే, అతడి కొరకు ఏమీ వ్రాయబడదు. ఒకవేళ అతడు అన్నీ సమకూర్చుకుని కూడా ఆ పని చేయలేక ఆగిపోయినట్లయితే, (ఆ విధంగా ఆగిపోవడానికి సంబంధించి) అతని మనసులో ఉన్న సంకల్పము ననుసరించి అతని కొరకు ప్రతిఫలం వ్రాయబడుతుంది. ఒకవేళ అతడు ఆ చెడు పని చేసినట్లయితే, అతడి కొరకు ఒక చెడుపని చేసినట్లుగా వ్రాయబడుతుంది.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "నిశ్చయంగా, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా పేర్కొన్నాడు: ' ఎవరైనా నా స్నేహితులలో నుండి ఎవరినైనా శత్రువుగా భావించినట్లయితే, నేను అతనితో యుద్ధం చేస్తున్నానని నేను అతనికి ప్రకటిస్తాను. నా దాసుడు నాకు అత్యంత ఇష్టపూర్వకంగా, నేను అతనికి విధిగా చేసిన దాని ద్వారా మాత్రమే నాకు దగ్గరయ్యాడు. ఇంకా, నా దాసుడు అదనపు ఆరాధనల (సున్నతులు, నవాఫిల్) ద్వారా నాకు నిరంతరం దగ్గరవుతూనే ఉంటాడు, చివరికి నేను అతనిని ప్రేమిస్తాను. నేను అతనిని ప్రేమించినప్పుడు, నేను అతను వినే చెవిని, అతను చూసే కంటిని, అతను పట్టుకునే చేతిని, అతను నడిచే కాలిని అవుతాను (అంటే ఈ అవయవాలన్నింటినీ అల్లాహ్ తన ఆధీనంలో తీసుకుంటాడు, చెడు నుండి దూరంగా ఉంచుతాడు). మరియు అతను నన్ను ఏదైనా అడిగితే, నేను తప్పకుండా అతనికి ఇస్తాను. మరియు అతను నా రక్షణ కోరితే, నేను తప్పకుండా అతనికి రక్షణ కల్పిస్తాను.'"
అల్ బుఖారీ నమోదు చేసినారు:హదీథ్ ఖుద్సీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: అల్లాహ్ అజ్జవజల్ ఇలా సెలవిచ్చాడు: "నా స్నేహితులలో (ఔలియా) ఎవరిని బాధపెట్టినా, కోపం తెప్పించినా, లేదా ద్వేషించినా, నిశ్చయంగా నేను అతనితో యుద్ధాన్ని ప్రకటిస్తాను మరియు శత్రుత్వాన్ని బహిరంగంగా తెలియజేస్తాను." 'వలీ' (అల్లాహ్ యొక్క స్నేహితుడు) అంటే అల్లాహ్ ను విశ్వసించే స్వచ్ఛమైన విశ్వాసి, దైవభీతి గలవాడు. ఒక దాసుడికి ఎంత విశ్వాసం (ఈమాన్) మరియు దైవభీతి (తఖ్వా) ఉంటుందో, అల్లాహ్ యొక్క స్నేహంలో అతనికి అంత భాగం లభిస్తుంది. ఒక ముస్లిం తన ప్రభువుకు తాను అత్యంత ఇష్టమైనదిగా, ఆయన విధిగా చేసిన తప్పనిసరి విధేయతలను (ఆరాధనలను) పాటించడం మరియు నిషేధించబడిన వాటిని విడిచిపెట్టడం ద్వారానే దగ్గరవుతాడు. ఒక ముస్లిం విధిగా చేసిన వాటితో పాటు అదనపు ఆరాధనలను (సున్నతులను, నవాఫిల్) కూడా చేయడం ద్వారా తన ప్రభువుకు నిరంతరం దగ్గరవుతూనే ఉంటాడు, చివరికి అల్లాహ్ యొక్క ప్రేమను పొందుతాడు. అల్లాహ్ అతనిని ప్రేమించినప్పుడు, ఈ నాలుగు అవయవాల విషయంలో ఆయన అతనికి మార్గదర్శకుడుగా ఉంటాడు: "ఆయన (అల్లాహ్) అతని వినికిడి విషయంలో అతనికి మార్గదర్శకుడుగా ఉంటాడు, తద్వారా అతను అల్లాహ్ ను సంతృప్తిపరిచే వాటిని మాత్రమే వింటాడు." "మరియు ఆయన (అల్లాహ్) అతని చూపు విషయంలో అతనికి మార్గదర్శకుడుగా ఉంటాడు, తద్వారా అతను అల్లాహ్ చూడడానికి ఇష్టపడే మరియు సంతృప్తిపడే వాటిని మాత్రమే చూస్తాడు." "మరియు ఆయన (అల్లాహ్) అతని చేతుల విషయంలో అతనికి మార్గదర్శకుడుగా ఉంటాడు, తద్వారా అతను అల్లాహ్ ను సంతృప్తిపరిచే పనులను మాత్రమే తన చేతితో చేస్తాడు." "మరియు ఆయన (అల్లాహ్) అతని కాళ్ళ విషయంలో అతనికి మార్గదర్శకుడుగా ఉంటాడు, తద్వారా అతను అల్లాహ్ ను సంతృప్తిపరిచే మార్గంలో మాత్రమే నడుస్తాడు మరియు శుభమైన వాటిని మాత్రమే ప్రయత్నిస్తాడు." మరియు వీటితో పాటు, అతను అల్లాహ్ ను ఏదైనా అడిగితే, అల్లాహ్ అతడు అడిగినది అతడికి ఇస్తాడు, తద్వారా అతని దుఆ స్వీకరించబడుతుంది. మరియు అతను రక్షణ కోరుతూ అల్లాహ్ ను ఆశ్రయిస్తే, అల్లాహ్ అతనికి భయం నుండి రక్షణ కల్పిస్తాడు మరియు అతన్ని కాపాడుతాడు.