





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం: “పెద్ద పాపములకు దూరంగా ఉన్నట్లయితే; (ప్రతిదినము విధిగా ఆచరించే) ఐదుపూటల నమాజులు, ఒక శుక్రవారపు నమాజు నుండి మరో శుక్రవారపు నమాజు వరకు, అలాగే ఒక రమదాన్ మాసము నుండి మరో రమదాన్ మాసము వరకు – వీటి మధ్య జరిగే చిన్నచిన్న పాపాలకు అవి పరిహారంగా మారతాయి”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – ప్రతి రోజూ విధిగా ఆచరించే ఐదుపూటల నమాజులు, ప్రతి శుక్రవారము ఆచరించే ‘శుక్రవారపు జుమఅహ్ నమాజు’, మరియు ప్రతి సంవత్సరం రమదాన్ నెల ఉపవాసాలు విధిగా ఆచరించుట – వాటి మధ్య (దాసుని వల్ల) జరిగే చిన్న పాపములకు అవి పరిహారంగా మారతాయి; అయితే పెద్ద పాపములకు దూరంగా ఉండాలి. పెద్ద పాపములు (అల్ కబాయిర్) అంటే - వ్యభిచారానికి, వివాహేతర లైంగిక సంబంధాలకు పాల్బడుట, మద్యపానము చేయుట వంటివి పరిహరించబడవు. అవి క్షమింపబడుట కొరకు పశ్చాత్తాపము తప్పనిసరి.
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “బంధుత్వపు సంబంధాలను నిలబెట్టేవాడు అంటే తన బంధువులు చేసిన మేలుకు ప్రతిఫలం ఇచ్చేవాడని కాదు; కానీ, తనతో బంధుత్వపు బంధాన్ని తెంచుకున్న బంధువులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు”.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో ఇలా తెలియ జేస్తున్నారు: బంధువులతో బంధుత్వపు సంబంధాలను కొనసాగించడంలో మరియు వారితో దయ, కరుణా గుణాలతో వ్యవరించడంలో సంపూర్ణత కలిగిన వ్యక్తి అంటే, వారు తనకు చేసిన ఉపకారానికి బదులుగా అటువంటి ఉపకారమే చేసే వాడు కాదు. వాస్తవానికి బంధుత్వపు బంధాలను జోడించి ఉంచడంలో సంపూర్ణత కలిగిన వ్యక్తి అంటే, తనతో బంధుత్వాన్ని తెంచుకున్నా, తిరిగి దానిని జోడించేవాడు. వారు తనతో అమర్యాదగా, అవమానకరంగా ప్రవర్తించినా సరే, వారిని దయతో, వాత్సల్యములతో కలిసే వాడు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ, రమజాన్ నెల ఉపవాసాలు పాటిస్తారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు అల్లాహ్ రమజాన్ నెల ఉపవాసములు ఆచరించుటను విధిగావించినాడనే విషయాన్ని విశ్వసిస్తూ; ఉపవాసములు పాటించే వారి కొరకు అల్లాహ్ తన అంతులేని ఖజానాల నుండి సిధ్ధం చేసి ఉంచిన పారితోషికం, ప్రతిఫలం మరియు పుణ్యఫలముల నందు విశ్వసిస్తూ; ప్రదర్శనా బుధ్ధితో గాక లేదా పేరు ప్రతిష్టల కొరకు గాక, కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే సంకల్పించి, రమజాన్ నెల ఉపవాసములు ఆచరిస్తారో అటువంటి వారి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ లో (రమజాన్ నెలలోని ఘనమైన రాత్రి) నమాజు ఆచరిస్తూ (అల్లాహ్ ఆరాధనలలో) గడుపుతారో అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘లైలతుల్ ఖద్ర్’ లో అల్లాహ్ యొక్క ఆరాధనలలో గడపడం యొక్క ఘనతను తెలియ జేస్తున్నారు. అది రమజాన్ నెల ఆఖరి పది రాత్రులలో వస్తుంది. ఎవరైతే ఆ రాత్రి యందు ప్రదర్శనా బుద్ధి లేకుండా, పేరుప్రఖ్యాతుల కొరకు కాకుండా, శ్రధ్ధగా నమాజులలో, ఖుర్’ఆన్ పారాయణంలో, అల్లాహ్ ధ్యానములో మరియు ఆయనను వేడుకొనుటలో; ఆ రాత్రి యొక్క ఘనతను విశ్వసిస్తూ మరియు ఆ రాత్రి గురించి ఏమి అవతరించబడినదో దానిలో పూర్తి విశ్వాసముతోను; మరియు అందుకు గానూ అల్లాహ్ ప్రసాదించే పుణ్యఫలంపై ఆశతోనూ గడుపుతాడో, అటువంటి వాని పూర్వపు పాపాలు క్షమించి వేయబడతాయి.
ను’మాన్ ఇబ్న్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం – “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రస్తావిస్తుండగా నేను విన్నాను”; తాను చెవులారా విన్నట్లుగా, ను’మాన్ ఇబ్న్ బషీర్ తన చేతుల (చూపుడు) వేళ్ళను తన చెవులకు దగ్గరగా తీసుకుని వెళ్ళి చూపించినారు: “నిశ్చయంగా ‘హలాల్’ ఏమిటో (ఏమి అనుమతించ బడినదో) స్పష్టం చేయబడినది మరియు నిశ్చయంగా ‘హరామ్’ ఏమిటో (ఏమి నిషేధించబడినదో) స్పష్టం చేయబడినది. మరియు ఆ రెంటికి మధ్య ఉన్నవి సందిగ్ధ విషయాలు. వాటి గురించి ప్రజలలో చాలా మందికి (సరియైన) ఙ్ఞానము లేదు. ఎవరైతే సందిగ్ధ విషయాల నుండి దూరంగా ఉన్నాడో అతడు, తన ధర్మాన్ని గురించి బాధ్యతను మరియు తన గౌరవాన్ని స్పష్ట పరుచుకున్నాడు. మరియు ఎవరైతే సందిగ్ధ విషయాలలో పడిపోయాడో అతడు – ప్రవేశం నిషేధించబడిన పొలం గట్టున పశువులను మేపుతున్న పశువుల కాపరి యొక్క పశువులు, ఏదో క్షణంలో పొలం లోనికి వెళ్ళి పోయినట్లుగా – అతడు ‘హరామ్’ లో పడిపోతాడు. గుర్తుంచుకోండి, ప్రతి రాజుగారికి ఒక రక్షిత పొలం (భూమి) ఉంటుంది. గుర్తుంచుకోండి, అల్లాహ్ యొక్క రక్షిత పొలం (భూమి) ఏమిటంటే, ఆయన నిషేధించిన విషయాలు. మరియు గుర్తుంచుకోండి, శరీరంలో ఒక మాంసం ముద్ద ఉన్నది. అది ఆరోగ్యవంతంగా ఉంటే, మిగతా శరీరం అంతా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒకవేళ అది కలుషితమై పోతే (చెడిపోతే) శరీరం మొత్తం కలుషితమై పోతుంది. అదే అతడి ‘గుండె’.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్’లో విషయాలకు సంబంధించి ఒక సాధారణ నియమాన్ని గురించి విశదీకరించారు. షరియత్ లో విషయాలు మూడు వర్గాలుగా విభజించ బడినాయి. అవి ‘హలాల్’ విషయాలుగా (అనుమతించబడిన విషయాలుగా) స్పష్టపరచ బడినవి, ‘హరామ్’ విషయాలుగా (నిషేధించబడిన విషయాలుగా) స్పష్టపరచ బడినవి మరియు ‘హలాల్’ వర్గానికి చెందినవా లేదా ‘హరామ్’ వర్గానికి చెందినవా అనే స్పష్టత లేని ‘సందిగ్ధ విషయాలు’. ఆ విషయాలకు సంబంధించి షరియత్ యొక్క ఆదేశం ఏమిటో ప్రజలలో చాలా మందికి తెలియదు. మరి ఎవరైతే అటువంటి సందిగ్ధ విషయాలను (వాటి జోలికి పోకుండా) వదిలివేస్తాడో, అతడు ‘హరామ్’ లో పడిపోకుండా తన ధర్మాన్ని స్థిరంగా, సురక్షితంగా ఉంచుకున్న వాడవుతాడు. అలాగే (తనకు ఙ్ఞానము లేని) సందిగ్ధ విషయాల జోలికి వెళ్ళినందుకు, ప్రజలు అతడిపై వేసే భాండాలనుండి తన గౌరవాన్ని కాపాడుకున్న వాడవుతాడు. మరియు ఎవరైతే అటువంటి సందిగ్ధ విషయాలనుండి దూరంగా ఉండడో, అతడు తనను తాను ‘హరామ్’ లో పడిపోవడానికి లేదా ప్రజల అపవాదులకు, అగౌరవానికి గురిచేసుకున్న వాడవుతాడు. సందిగ్ధ విషయాలకు దూరంగా ఉండకుండా, (తగినంత ఙ్ఞానము లేకపోయినా) వాటి జోలికి వెళ్ళే వాడిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పశువుల కాపరితో పోల్చినారు. ఆ పశువుల కాపరి తన పశువులను, ఒక ఆసామి యొక్క స్వంత పొలానికి అతి దగ్గరగా మేపుతూ ఉంటాడు; ఏ క్షణమైనా తన పశువులు గట్టుదాటి ఆ పొలములోనికి దూరిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ. అదే విధంగా, ఒక విషయం ‘హలాల్’ వర్గానికి చెందినదా, లేక ‘హరామ్’ వర్గానికి చెందినదా అనే స్పష్టత లేనపుడు, ఆ విషయానికి సంబంధించి షరియత్ యొక్క ఆదేశం ఏమిటి అనే ఙ్ఞానం లేనపుడు దాని జోలికి వెళ్ళే వ్యక్తి, హరాం లో పడిపోయేటంత ప్రమాధకరమైన స్థితికి అతి దగ్గరగా వెళుతున్నాడన్నమాట. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు. దేహంలో ఒక మాంసపు ముద్ద (హృదయం) ఉంటుందని, ఒకవేళ అది సరిగా (ఆరోగ్యవంతంగా) ఉంటే అది మొత్తం శరీరపు ఆరోగ్యతకు బాధ్యత వహిస్తుందని; ఒకవేళ అది కల్మష పడిపోతే, కలుషితమైపోతే మొత్తం శరీరం అదేవిధంగా మారడానికి కారణం అవుతుందని వివరిస్తున్నారు.
షద్దాద్ బిన్ ఔస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి రెండు విషయాలను కంఠస్థం చేసుకున్నాను. వారు ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ ప్రతి విషయంలోనూ కారుణ్యం కలిగి ఉండాలని ఆదేశించినాడు. కనుక ఒకవేళ ఏదైనా ప్రాణిని చంపితే (చంప వలసి వస్తే), ఆ ప్రక్రియను యుక్తమైన విధంగా నిర్వహించండి, అలాగే ఏదైన ప్రాణిని అల్లాహ్ పేరున జిబహ్ చేస్తే (చేయవలసి వస్తే), ఆ ప్రక్రియను కూడా యుక్తమైన విధంగా నిర్వహించండి. మీలో ఒకరు (ఎవరు ఆ పనిని నిర్వహిస్తారో వారు) ఆ ప్రాణికి బాధ తెలియనంత పదునుగా ఉండేలా తన కత్తికి పదును పెట్టాలి”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు – ‘ప్రతి విషయంలోనూ ‘అల్ ఇహ్’సాన్’ కలిగి ఉండడాన్ని అల్లాహ్ మనపై విధిగావించినాడు. (అల్ ఇహ్’సాన్: అంటే, ఉచితమైన స్థాయి కంటే కూడా ఎక్కువగా కరుణ కలిగి ఉండుట అనే అర్థం ఉన్నది). అది (అల్ ఇహ్’సాన్) అల్లాహ్ పట్ల అన్ని వేళలా చేతన కలిగి ఉండుట, ఆయన ఆరాధనలలో, అన్ని వేళలా మంచిని చేయటలో, దాతృత్వ గుణాన్ని కలిగి ఉండుటలో, అల్లాహ్ సృష్టితాలకు నష్టం కలిగించకుండా ఉండుట - మొదలైన విషయాలలో చేతన కలిగి ఉండుట ద్వారా సాధించ బడుతుంది. అదే విధంగా ‘అల్ ఇహ్’సాన్’ కలిగి ఉండ వలసిన విషయాలలో, ఏదైనా ప్రాణం తీయుట మరియు అల్లాహ్ పేరున జిబహ్ చేయుట కూడా ఉన్నాయి. అల్’ఖిసాస్ విషయంలో ‘అల్ ఇహ్’సాన్’ పాటించుట: (అల్ ఖిసాస్ – అంటే షరియత్ ప్రకారం ‘ప్రాణానికి ప్రాణము’ అనే నియమం క్రింద, హతుని కుటుంబము క్షమాభిక్ష ప్రసాదించక పోతే, హంతకునికి విధించబడే మరణ శిక్ష): ఆ సందర్భములో హంతకునికి కష్టము, బాధ కలుగకుండా, తేలికగా, అత్యంత వేగంగా అతని ప్రాణం పోయే విధానాన్ని ఎంచుకోవడం. అల్లాహ్ పేరున జంతువు జిబహ్ చేయ బడునప్పుడు ‘అల్ ఇహ్’సాన్’ పాటించుట: జిబహ్ చేయబడే జంతువు ఎదురుగా (అది చూస్తుండగా) కత్తిని పదును చేయరాదు మరియు ( మందలోని) ఇతర జంతువులు చూస్తుండగా జిబహ్ చేయరాదు.
అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరికీ హాని తలపెట్టకండి, హాని తలపెట్టిన వానికి ప్రతీకారం చేయకండి. ఎవరైతే (ఇతరులకు) హాని తలపెడతాడో అల్లాహ్ అతడికి హాని కలుగజేస్తాడు మరియు ఎవరైతే (ఇతరుల పట్ల) కఠినంగా ఉంటాడో, అల్లాహ్ అతడి పట్ల కఠినంగా ఉంటాడు”.
దారు ఖుత్నీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు - ఇతరులకు హాని కలిగించుట అనేది అది ఏ రూపంలో ఉన్నా, ప్రతి ఒక్కరూ తన స్వయం నుండి మరియు ఇతరుల నుండి దానిని దూరం చేయాలి. కనుక ఏ ఒక్కరు కూడా తన స్వయానికి హాని తలపెట్టు కొనుటకు అనుమతి లేదు. అలాగే ఇతరులకు హాని తలపెట్టుటకు అనుమతి లేదు. మరియు హానికి ప్రతీకారంగా తిరిగి హాని తలపెట్టడానికి అనుమతి లేదు, శిక్షలో భాగమైతే తప్ప. అది కూడా హద్దుమీరకుండా, ఉల్లంఘనలకు పాల్బడకుండా. ఎందుకంటే హాని, హాని ద్వారా తొలగించబడదు. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ప్రజలకు హాని తలపెట్టే వానికి, (అల్లాహ్ తరఫు నుండి) హాని కలుగుతుందని, ప్రజలపట్ల కఠినంగా ఉండే వానికి (అల్లాహ్ తరఫు నుండి) కాఠిన్యమే లభిస్తుందని - హెచ్చరించినారు.
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు ‘నేను మహానీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ చెప్తుండగా విన్నాను ‘నేను వారించిన విషయాలకు మీరు దూరంగా ఉండండి,ఆదేశించిన విషయాలను శక్తి మేరకు ఆచరించండి,యదార్థంగా మీ పూర్వపు జాతులవారు అధిక ప్రశ్నలతో వారి ప్రవక్తలను విభేదించినందువలన నాశనం చేయబడ్డారు.
ముత్తఫిఖ్ అలైహిమహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మనకు మార్గనిర్దేశం చేసారు,ఆయన ఏదైనా విషయాన్ని నిషేధించినట్లయితే,ఎటువంటి మినహాయింపు లేకుండా దానికి దూరంగా ఉండాలి,మరియు ఏదైనా చేయమని మనకు ఆదేశిస్తే శక్తిమేరకు చేయగలిగినంతగా దాన్నిఆచరించాలి,పిదప మునుపటి జాతుల మాదిరిగా మనము మారకూడదని ఆయన హెచ్చరించారు,వారు వారి ప్రవక్తలను అధిక ప్రశ్నలు అడిగారు,వారితో విభేదించారు, కాబట్టి అల్లాహ్ వారిని విధ్వంసకరమైన మరియు వినాశనకరమైన వివిధ రకాల శిక్షలకు గురిచేశాడు,కాబట్టి వారు నడిచిన మార్గాల్లో అనుసరించకుండా ఉన్నట్లైతే వారిలా నాశనం కాకుండా మనము రక్షించుకోగలము.
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “(ఒకసారి అల్లాహ్ వద్ద నుండి సందేశం తీసుకుని నా వద్దకు వచ్చినపుడు) జిబ్రయీల్ అలైహిస్సలాం పొరుగువాని హక్కులను గురించి నాకు ఎంతగా ఉపదేశించినారంటే, పొరుగు వానిని వారసుడిగా చేస్తారేమోనని నాకు సందేహం కలిగింది”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి జిబ్రయీల్ అలైహిస్సలాం తన వద్దకు వచ్చినపుడు జరిగిన విషయాన్ని వివరిస్తున్నారు. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం పొరుగువాని హక్కులను గురించి పలుమార్లు, మాటిమాటికి గట్టిగా నొక్కి చెప్పినారని, ఆదేశించినారని చెప్పారు. పొరుగువాడు అంటే మన ఇంటికి పొరుగునే ఉండే వాడు కావచ్చు లేక మన ఇంటికి సమీపంలో ఉండే వాడు కావచ్చు, అతడు ముస్లిం కావచ్చు, లేక అవిశ్వాసి కావచ్చు, మన బంధువు కావచ్చు లేక ఇంకెవరైనా కావచ్చు; అతడి హక్కులను పరిరక్షించుట, అతనికి హాని, కీడు, నష్టము తలపెట్టకుండా ఉండుట, అతని పట్ల సత్ప్రవర్తనతో వ్యవహరించుట, అతడు ఏమైనా హాని, నష్టము తలపెడితే దానిపై సహనం వహించుట మొదలైన వాటి గురించి జిబ్రయీల్ అలైహిస్సలాం పలుమార్లు ఎంతగా చెప్పినారంటే, పొరుగువాని హక్కుల పట్ల గౌరవం, మరియు జిబ్రీల్ అలైహిస్సలాం పలుమార్లు గట్టిగా చెప్పడం చూసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తాను చనిపోయిన తరువాత తన సంపదకు పొరుగువానిని వారసునిగా చేస్తూ వహీ అవతరిస్తుందేమో అని సందేహించారు.